
● పొద్దంతా రెక్కీ.. రాత్రిళ్లు చోరీ ● జిల్లాలో బెంబేలెత
కరీంనగర్‌లోని వివేకానందపురికాలనీలో ఉన్న అపార్టుమెంటులో తాళంవేసి ఉన్న ఓ ఫ్లాట్‌లో ఈనెల 6వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. బీరువాలో ఉన్న 30తులాల బంగారాన్ని అపహరించుకుపోయాడు. బాధితుల ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్‌క్రైం: ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. మనచుట్టే ఉంటూ.. అన్నీ గమనిస్తూ.. అదను చూసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. పొద్దంతా రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ వినియోగిస్తూ.. లొకేషన్ ద్వారా తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తిస్తూ గుల్ల చేస్తున్నారు. కమిషనరేట్‌వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న దొంగతనాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరీంనగర్ సిటీతో పాటు శంకరపట్నం, గన్నేరువరం, రామడుగు, మానకొండూర్, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల పరిధిలో గత రెండుమూడు నెలలుగా తాళం వేసిఉన్న ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. అప్రమత్తం అవుతున్న పోలీసులు నగరంతో పాటు గ్రామాల్లో గస్తీ పెంచారు.
పొద్దంతా రెక్కీ.. రాత్రిళ్లు చోరీ..
జిల్లాకు ఉపాధికోసమని, అవసరాల నిమిత్తం చా లామంది గుర్తు తెలియని వ్యక్తులు, ఇతర రాష్ట్రాల వారు, పొరుగుజిల్లాల వ్యక్తులు వస్తున్నారు. వీరిలో కొందరు పొద్దంతా గ్రామాలు.. పట్టణాలు.. నగరాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారు. తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తిస్తూ రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో కమిషనరేట్ పరిధిలో సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు కార్డెన్‌సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలవారు, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు.
గూగుల్ లొకేషన్ ఆధారంగా...
కొందరు అధునాతన టెక్నాలజీని వాడుతూ దొంగతనం చేస్తున్నారు. పొద్దంతా రెక్కీ నిర్వహించిన తరువాత రాత్రి చోరీ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్న ఇంటికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ పెట్టుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నా రు. పలువురు బంగారం వ్యాపారులు చోరీచేసిన సొత్తును దొంగల నుంచి కొనుగోలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఎక్కువగా జల్సాల కోసం ఖరీదైన లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసు విచారణలో తెలుస్తోంది.
గస్తీ పెంచుతున్నాం
దొంగతనం కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. దొంగతనం చేసిన బంగారం కొనుగోలు చేయడమూ నేరమే. గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దొంగతనాల దృష్ట్యా రాత్రిళ్లు పెట్రోలింగ్, గస్తీ పెంచుతున్నాం.
– గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్