
కాలేజీ ఒకచోట.. వసతి మరోచోట
● ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు రవాణా తిప్పలు ● ఉన్నది ఒకే బస్సు.. మూడో బ్యాచ్ వస్తే కష్టమే ● ఈ ఏడాది ప్రారంభం కానున్న తరగతులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు రవాణా కష్టంగా మారింది. ఇప్పటివరకు మొదటి, రెండో ఏడాది విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ విద్యా సంవత్సరం మూడో బ్యాచ్ విద్యార్థులు జాయిన్ కానున్నారు. మెడికల్ కళాశాలకు పక్కా భవనాలు లేకపోవడంతో కొత్తపల్లిలోని విత్తనాభివృద్ధి సంస్థ గోదాముల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. బాలికలకు తీగలగుట్టపల్లిలో, బాలురకు సీతారాంపూర్‌లో కొంతమందికి, దుర్గమ్మగడ్డలో మరి కొంతమందికి వసతి ఏర్పాటు చేశారు. వీరందరిని ప్రతిరోజు సమయానికి కళాశాలకు తరలించేందుకు ఒకేఒక్క బస్సు ఉంది. ఈ బస్సులోనే మూడు ప్రాంతాల నుంచి విద్యార్థులు వెళ్తారు. దీంతో ప్రతిరోజు కళాశాలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. రెండు సంవత్సరాల విద్యార్థులకే ఇలా ఇబ్బంది ఏర్పడితే, మరో నెలరోజుల్లో మూడో బ్యాచ్ విద్యార్థులు రానున్నారు. 300మందిని ఒకే బస్సులో పంపించడం అంటే కష్టతరమే. తమ రవాణా కష్టాలు తీర్చేందుకు మెడికల్ కళాశాల అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ‘ప్రస్తు తం ఉన్న బస్సుతో ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థుల రవాణాకు ఇబ్బంది లేదు. మరో బ్యాచ్ పిల్లలు వస్తే మరో బస్సు అవసరముంటుంది. దానికోసం ఏర్పాట్లు చేస్తున్నాం’. అని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాఖియుద్దీన్ వివరించారు.