
ఆరోగ్యంతోనే ఆర్థిక సాధికారత
● కలెక్టర్ పమేలా సత్పతి
మానకొండూర్: మహిళలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూరు మండలం అన్నారంలో శుక్రవారం సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. సభలో పలువురు మహిళలు ‘శుక్రవారంసభ’ నిర్వహణపై అభిప్రాయాలు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం సభ అన్నారం మహిళల్లో చైతన్యం నింపిందన్నారు. గ్రామంలోని 1,544 మంది మహిళల్లో 1,200మంది ఆరోగ్య మహిళ పరీక్షలు చేయించుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. మిగిలిన వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో బరువు తక్కువగా ఉన్న శిశువులు 14మంది ఉన్నారని, వారి విషయంలో అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ పాల్గొన్నారు.