
పెండింగ్ బకాయిలు చెల్లించాలి
కరీంనగర్: మధ్యాహ్న భోజన వర్కర్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డీఆర్‌వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సమ్మయ్య మాట్లాడుతూ 12నెలల నుంచి వేతనాలు అందడం లేదన్నారు. ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. నిత్యవసర వస్తువులు, గ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. మెనూ చార్జీలు రూ.25 చొప్పున ఇవ్వాలన్నారు. వంట కార్మికులకు గుర్తింపుకార్డులు ప్రోసీడింగ్ ఆర్డర్లు, డ్రెస్‌కోడ్ ఇవ్వాలన్నారు. గ్రీన్ చానల్ లేదా పీఎఫ్‌ఎంఎస్ ద్వారా బడ్జెట్‌ను రిలీజ్ చేసి కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేయాలన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్ల యూనియన్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సాయిలు, జిల్లా ప్రధాన కార్యదర్శి రజిత, కార్యదర్శి దేవేంద్ర పాల్గొన్నారు.