
కాంగ్రెస్ నాయకుడి తల్లి దారుణ హత్య
కొడిమ్యాల: మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ప్యాక్స్ చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు తల్లి ప్రేమలత (65) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ఆమె ఇంటి పక్కనే ఉన్న పాడుబడిన కుండీలో పడేశారు. కర్రలు, బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రేమలతకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు సత్యం గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు రాయికల్ మండలం బోర్నపల్లిలో వ్యాపారం చేస్తున్నారు. రాజనర్సింగరావు కరీంనగర్‌లో ఉంటున్నారు. ప్రేమలత నాచుపల్లిలోని తన ఇంట్లో ఒంటరిగానే నివసిస్తోంది. ఆమె కోడలు స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. సంఘటన స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పరిశీలించారు. హత్యకు పాల్పడింది స్థానికంగా ఉన్న ఓ వ్యక్తేనని స్థానికులు అనుమానిస్తున్నారు. సదరు వ్యక్తితో ప్రేమలతకు మధ్య గతంలో గొడవలు జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.