బైక్‌పై నుంచి జారిపడి యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి జారిపడి యువతి మృతి

Aug 8 2025 8:53 AM | Updated on Aug 8 2025 8:53 AM

బైక్‌

బైక్‌పై నుంచి జారిపడి యువతి మృతి

కొడిమ్యాల:బైక్‌ పైనుంచి పడి యువతి మృతి చెందిన ఘటన కొడిమ్యాల మండలం చెప్యాల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్‌ కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన గుర్రం మమత (30) తాటిపల్లి గ్రామానికి చెందిన గంగాధర స్వామిదుర్గయ్యతో కలిసి బుధవారం రాత్రి బైక్‌పై వేములవాడ నుంచి జగిత్యాల వైపు వస్తోంది. చెప్యాల శివారులో బైక్‌ అతివేగంగా నడపడం.. రోడ్డు పూర్తిగా గుంతలతో నిండి ఉండడంతో యువతి కాలు వెనుక టైరులో ఇరుక్కుని ప్రమాదవశాత్తు కింద పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి శంకరవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వృద్ధుడి ఆత్మహత్య

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన వంగల దేవిరెడ్డి(70) అనారోగ్యం బాధ భరించలేక గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. దేవిరెడ్డి కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదు. జీవితంపై విరక్తి చెంది ఇంటి వెనుకాల పశువుల కొట్టంలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే వరకే మరణించాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గడ్డిమందు తాగి ఒకరు..

జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని కాచాపూర్‌ గ్రామానికి చెందిన కొత్తకొండ లచ్చయ్య(52) కుటుంబ కలహాలతో గడ్డిమందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సనత్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. కాచాపూర్‌కు చెందిన లచ్చయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు. గురువారం తమ పొలంలో నాటు వేసేందుకు భార్య లక్ష్మిని రమ్మనగా కాళ్ల నొప్పులతో వెళ్లలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం జరుగగా, లచ్చయ్య పొలం వద్ద గడ్డిమందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.

30 తులాల బంగారం చోరీ

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ త్రీటౌన్‌ పరిధిలోని వివేకనందపురికాలనీలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. వివేకానందపూరికాలనీ రోడ్డు నంబర్‌–5లో ఉన్న ఓ అపార్టుమెంటులో వేదవ్యాస్‌ నివాసం ఉంటున్నాడు. అపార్ట్‌మెంట్‌కు రంగులు వేస్తుండడంతో సామగ్రి ప్లాట్‌లోనే ఉంచి, శ్రీపురంకాలనీలోని సొంత ఇంటి నుంచి వచ్చి వెళ్తున్నాడు. బుధవారం రాత్రి తన ప్లాట్‌కు తాళం వేసి శ్రీపురంకాలనీలోని ఇంటికి వెళ్లాడు. గురువారం వచ్చి చూడగా.. తన ప్లాట్‌లోని బీరువాలో దాచుకున్న 30తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదుతో సీఐ జాన్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల

హాల్టింగ్‌ కోసం వినతి

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి ప్రాంత ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర తెలంగాణ రైల్వేఫోరం అధ్యక్షుడు ఫణి కోరారు. గురువారం సికింద్రాబాద్‌ రైల్‌నిలయంలో సీపీటీఎం రవిచందర్‌కు వినతిపత్రం అందించారు. తెలంగాణ ఏర్పడి 11ఏళ్లు దాటినా రాష్ట్రం పేరుతో ప్రత్యేక రైలు లేదన్నారు. తెలంగాణ సంపర్క్‌ క్రాంతి రైలును హైదరాబాద్‌–ఢిల్లీ వయా కామారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల మార్గంలో నడపాలన్నారు. అలాగే బల్లార్ష– ఖాజీపేట రైలును చర్లపల్లి వరకు, కాచిగూడ– కరీంనగర్‌ డెమో రైలును పెద్దపల్లి వరకు, రాయలసీమ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్‌ వరకు, నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు పొడిగించాలని విన్నవించినట్టు తెలిపారు.

మహిళను వేధించిన

వ్యక్తిపై కేసు

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో ఓ తాత్కాలిక మహిళా ఉద్యోగిపై, అదే ఆస్పత్రిలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న తాజొద్దీన్‌ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు వన్‌టౌన్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇటీవల కొందరు ఉద్యోగులను పనిలోంచి తొలగించగా, ఇందులో సదరు మహిళ కూడా ఉంది. తన కుటుంబ పోషణకు ఉద్యోగం అత్యవసరమని ఉన్నతాధికారులను వేడుకోగా, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి అంగీకరించారని బాధితురాలు వెల్లడిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం విధుల్లో చేరడానికి ఆస్పత్రికి వచ్చిన మహిళ పట్ల, తోటి ఉద్యోగుల ముందే సూపర్‌వైజర్‌ దురుసుగా, అవమానపర్చేలా ప్రవర్తించడంతో మనస్తాపంతో ఆస్పత్రి భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయగా తోటి ఉద్యోగులు అడ్డుకున్నారు.

బైక్‌పై నుంచి జారిపడి   యువతి మృతి1
1/1

బైక్‌పై నుంచి జారిపడి యువతి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement