
దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలని..
● ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ
● అరెస్ట్ చేసే వరకూ కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయింపు
● గొల్లపల్లిలో ఉద్రిక్తతకు దారితీసిన బాధిత కుటుంబాల ధర్నా
గొల్లపల్లి: అకారణంగా తన భర్తపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగిన ఘటన గొల్లపల్లిలో ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుల కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతానికి చెందిన దండ్ల శ్రీనివాస్‌పై అదే ప్రాంతానికి చెందిన ఒర్సు విజయ్, ఇడగొట్టు సురేందర్, వేముల వంశీ, ఇడగొట్టు తిరుపతి కలిసి మంగళవారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. శ్రీనివాస్ తన బర్త్‌డేను తన బంధువుల ఇంట్లో జరుపుకుంటుండగా అకారణంగా వచ్చి దాడిచేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డుకోబోయిన ఒర్సు రాజ్‌కుమార్, ఒర్సు ఆంజనేయులుపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్‌పై దాడి విషయాన్ని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఒర్సు విజయ్, ఇడగొట్టు సురేందర్, ఇడగొట్టు తిరుపతి, వేముల వంశీ, ఒర్సు చెన్నవ్వపై కేసు నమోదు చేసినా.. అరెస్ట్ మాత్రం చేయలేదు. నిందితులపై చర్యలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారంటూ శ్రీనివాస్ భార్య అంజలితోపాటు కుటుంబసభ్యులు గురువారం గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డిని ప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేస్తామని, ఇందుకు సమయం పడుతుందని తెలిపారు. బాధితులు ఇప్పుడే అరెస్ట్ చేయాలంటూ జగిత్యాల–ధర్మారం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన తన భర్తకు న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, పోలీసులు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని ఫ్లెక్సీ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిషాంత్‌రెడ్డి పోలీస్ కేసు విత్‌డ్రా చేసుకోవాలని, కాంప్రమైజ్ కావాలని తమపై ఒత్తిడి తెస్తూ.. బెదిరిస్తున్నాడని బాధితుడి భార్య అంజలి, సోదరుడు మహేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ గూండాల్లా వ్యవహరిస్తున్న వారిని అరెస్ట్ చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి వారికి నచ్చజెప్పారు. సీఐ రాంనర్సింహారెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు నింధితులను అరెస్ట్ చేసేంత వరకు ఊరుకునేది లేదని బాధితుని కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయ పోరాటం చేస్తామన్నారు.

దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలని..