
అనారోగ్యంతో తండ్రి.. ఉరేసుకుని కొడుకు..
జగిత్యాలక్రైం: ఒకేరోజు.. ఒకే గ్రామంలో తండ్రీకొడుకులు గంటల వ్యవధిలోనే చనిపోయిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం సోమన్‌పల్లి గ్రామంలో విషాదం నింపింది. తండ్రి అనారోగ్యంతో మృతిచెందగా.. ఆయన ఇబ్బందులు చూడలేక.. అప్పుల బాధ తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన చంద వెంకన్న (65)కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రవి ఐదేళ్ల క్రితం దుబాయ్‌లో హత్యకు గురయ్యాడు. చిన్న కుమారుడు తిరుపతి ఊరులోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. వెంకన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రవి ఇంటి వద్ద ఉంటున్నా.. తిరుపతి కూడా ఆయన బాగోగులు చూసుకుంటున్నాడు. బుధవారం రాత్రి తిరుపతి తండ్రి వద్దకు వెళ్లి బాగోగులు చూసుకుని ఇంటికొచ్చాడు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి వెంకన్న గురువారం ఉదయం మృతిచెందాడు. వెంకన్న కుటుంబ సభ్యులు తిరుపతికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అదే గ్రామంలో ఉన్న తిరుపతి మామ జొన్నల గంగన్నకు వివరించగా.. ఆయనతోపాటు భార్య సుజాత ఇంటికి వెళ్లి చూసేసరికి తిరుపతి బెడ్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి వ్యవసాయం చేస్తుండటంతో ఇటీవల అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సుజాత ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై సదాకర్ కేసు నమోదు చేశారు. ఒకే ఇంట్లో.. ఒకేరోజు తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వెంకన్నకు ఆయన పెద్దకుమారుని కొడుకు కార్తీక్ తలకొరివి పెట్టాడు. తిరుపతికి కూతురు శ్రీకృతి రెండేళ్లే ఉండడంతో మామ జొన్నల గంగన్న తలకొరివి పెట్టారు. ఒకరి తర్వాత మరొకరికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి
ఒకరి తర్వాత ఒకరికి అంత్యక్రియలు
సోమన్‌పల్లిలో విషాదం

అనారోగ్యంతో తండ్రి.. ఉరేసుకుని కొడుకు..

అనారోగ్యంతో తండ్రి.. ఉరేసుకుని కొడుకు..