కరీంనగర్‌టౌన్: హనుమాన్ దీక్షాపరుల శోభయాత్ర సందర్భంగా శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తికి, బీజేపీకి సంబంధం లేదని, అతను పార్టీ కార్యకర్త కాదని, ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివారం బీజేపీ నేతలు ఏసీపీ నరేందర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, ఉప్పరపల్లి శ్రీనివాస్, నాగసముద్రం ప్రవీణ్, ఎన్నం ప్రకాశ్, రవి తదితరులు ఏసీపీని కలిసి సమస్యను విన్నవించారు. హనుమాన్ దీక్షాపరుల శోభాయాత్రలో కొందరు ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించాలని ప్రయత్నాలు చే శారన్నారు. కత్తి తిప్పడం లాంటి ఘటనతో శోభయాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయని తెలిపారు. అనవసర వివాదాన్ని సృష్టించిన అరా చక శక్తులకు బీజేపీకి, హనుమాన్ దీక్షా పరులకు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని ఫేక్‌మీడియా సంస్థలు, సోషల్ మీడియా గ్రూపులు పనికట్టుకొని ఈ విషయంలో బీజేపీపై బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. తప్పుడు ప్రచారం చే స్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.