మురుగులో కాసుల వేట | Sakshi
Sakshi News home page

మురుగులో కాసుల వేట

Published Mon, May 27 2024 1:15 AM

మురుగ

● గతేడాది అమాంతం పెరిగిన డీసిల్టింగ్‌ అంచనాలు ● మున్సిపల్‌ సాధారణ నిధుల దుర్వినియోగం ● నాలాల నిర్వహణలో అమలుకాని సీడీఎంఏ నిబంధనలు ● కనుమరుగైన నాలా మ్యాన్‌ వాహనం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీకే) ఆధ్వర్యంలో నాలాల నిర్వహణ, డీసిల్టింగ్‌ ప్రక్రియ ఆ శించినంత మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. నాలా ల నిర్వహణలో కాసులవేట ఎక్కువగా.. వ్యర్థాలు తొలగించాల్సిన ఆలోచన తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతేడాది అమాంతం పెరిగిన డీసిల్టింగ్‌ ఖర్చే దీనికి నిదర్శనం. ఏటా కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) వర్షాకాలం ముందు జాగ్రత్తలో భాగంగా మురుగు కాల్వల్లో చర్యలు చేపట్టాల్సిందిగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా రెండు మీటర్ల వెడల్పు ఉన్న ఓపెన్‌ నాలాల్లో స్లాబ్‌ లేకుండా ఓపెన్‌గా పెట్టాలి. ఈ నాలాలను డీసిల్టింగ్‌ చేయాలి. ఇందుకు నగరపాలక సంస్థ ఏటా నాలాల్లో సిల్ట్‌ (మురుగు ఇసుక వ్యర్థాలు) తొలగించేందుకు మున్సిపల్‌ సాధారణ ఫండ్స్‌తో టెండర్లు పిలుస్తుంది.

శ్లాబులతో ఇబ్బందులు

నాలాల నిర్వహణ విషయంలో సీడీఎంఏ పలు నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం.. రెండు మీటర్ల వెడల్పు ఉన్న ఓపెన్‌ నాలాల్లో స్లాబ్‌ లేకుండా ఓపెన్‌గా పెట్టాలి. రెండు మీటర్ల కన్నా అధిక వెడల్పు ఉన్న నాలాలకు ప్రతీ 30 మీటర్లకు మ్యాన్‌హోల్స్‌ ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు పాటిండచం వల్ల అటు పౌరులకు రక్షణతోపాటు, నాలాల నిర్వహణ సులభతరమవుతుంది. కానీ, కరీంనగర్‌లో నాలాల నిర్వహణ దీనికి వ్యతిరేకంగా ఉంది. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలు పలుచోట్ల మూసి ఉండటం, రెండు మీట ర్ల కన్నా అధిక వెడల్పు ఉన్న నాలాలకు రక్షణ కంచె, మ్యాన్‌ హోల్స్‌ లేకపోవడం గమనార్హం. చాలా చోట్ల 50 నుంచి 400 మీటర్ల వరకు శ్లాబులు వేయడంతో నాలాలు మూసుకుపోయాయి. ఉదాహరణకు.. శనివారం అంగడి నుంచి బొమ్మ వెంకన్న భవనం , అక్కడ నుంచి వరాహస్వామి ఆలయం వరకు ఉన్న వరద కాలువ మీద చాలా వరకు శ్లాబుతో కప్పి ఉంది. ఫలితంగా ఈ కాలువలో టన్నుల కొద్ది వ్యర్థాలు అలాగే మిగిలిపోతున్నాయి.

2023లో పెరిగిన అంచనా వ్యయం

ఏటా వర్షాకాలానికి ముందు బల్దియా నాలాల్లో డీసిల్టింగ్‌ ప్రక్రియ చేపడుతుంది. ఈ వ్యయం ప్రతీ సంవత్సరం రూ.30 లక్షలకు అటూఇటుగా ఉంటుంది. గతేడాది ఇదేపనికి రూ.54.58 లక్షలు కేటాయించి, ఈ ఏడాది రూ.38.22 లక్షలతో అంచనాలు రూ పొందించారు. ఇది ఎలా సాధ్యమైందో అధికారులకే తెలియాలి. 2023లో బక్రీద్‌, రంజాన్‌ సందర్భంగా ఈద్గాల్లో ఏర్పాట్ల విషయంలోనూ చేసిన ఖర్చు ఏటా చేసే ఖర్చు సగటు కన్నా 50 శాతం పెరగడం విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. పలు ఫెయిర్స్‌ అండ్‌ ఫెస్టివల్స్‌ ప్రోగ్రాం కింద బల్ది యా 2023 సంవత్సరంలో చేసిన అన్ని ఎస్టిమేషన్లను పరిశీలిస్తే.. చాలా విషయాలు బయటపడతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

డి–94 కాలువలోనూ పూడిక తీత..

కొత్తపల్లి మండలంలో మొదలై రేకుర్తి మీదుగా కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించే ప్రధాన వనరు డీ–94 కాలు వ. రేకుర్తిలోని షేఖాబీ కాలనీ నుంచి జగిత్యాల రోడ్‌ నుంచి గౌడ్స్‌ కాలనీ వరకు కాలువను శుభ్రం చేయడానికి బల్దియా రూ.4.82 లక్షలతో అంచనాలకు మించి టెండర్లు పిలవడం విమర్శలకు దారి తీసింది. ఇరిగేషన్‌ ఆధ్వర్యంలో ఉన్న డీ–94 కెనాల్‌లో పలువురు స్థానికులు తమ నివాసాల నుంచి డ్రైనేజీ పైపులైన్లు వేసి, వ్యర్థాలను నేరుగా కాలువలోకి వదులుతున్నారు. దీనిపై పలువురు ఇరిగేషన్‌ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బల్దియా బాధ్యత వహించాలని ఖరాఖండిగా చెప్పడంతో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ సిల్టింగ్‌ పనులు చేపడుతున్నారు. దీనిపై ఎంసీకే ఈఈ రొడ్డ యాదగిరిని సంప్రదించగా.. పెరిగిన అంచనా వ్యయం వివరాలను పరిశీలిస్తామని వివరణ ఇచ్చారు.

నాలా మ్యాన్‌ వాహనం ఎక్కడ?

ప్రతీ వర్షాకాలంలో చేపట్టే డీసిల్టింగ్‌ ప్రక్రియ కోసం బల్దియా 2020లో దాదాపు రూ.19.75 లక్షలతో ‘నాలా మ్యాన్‌’ వాహనం కొనుగోలు చేసింది. ఆ ఏడాది నాలా డీసిల్టింగ్‌ పనుల్లో ఈ వాహనాన్ని వినియోగించారు. ఆ తరువాత ఈ వాహనం కనిపించలేదు.

సంవత్సరం పనిపేరు పనులు టెండర్లు

2021 డీసిల్టింగ్‌ 8 రూ.30.53 లక్షలు

2022 డీసిల్టింగ్‌ 8 రూ.31.60 లక్షలు

2023 డీసిల్టింగ్‌ 15 రూ.54.58 లక్షలు

2024 డీసిల్టింగ్‌ 16 రూ.38.22 లక్షలు

మురుగులో కాసుల వేట
1/2

మురుగులో కాసుల వేట

మురుగులో కాసుల వేట
2/2

మురుగులో కాసుల వేట

Advertisement
 
Advertisement
 
Advertisement