
తాహెర్‌కొండాపూర్ కేంద్రంలో గన్నీ సంచులు
● ప్రతి కేంద్రానికి 10వేలు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ సహకార సంఘం ఆధ్వర్యంలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్, చెర్లభూత్కూర్, తాహెర్‌కొండాపూర్, బొమ్మకల్, దుబ్బపల్లి, జూబ్లీనగర్, నగునూరు, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, కమాన్‌పూర్, ఎలగందల్, నాగులమల్యాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈనెల 4నుంచి కొన్ని కేంద్రాల్లో ధాన్యం తూకం వేసి రైసుమిల్లులకు తరలించగా.. మంగళవారం నుంచి మిగతా కేంద్రాల్లో కాంటా పెడుతున్నారు. ఆయా కేంద్రాలకు అవసరమైన గన్నీ సంచులను పంపించారు. ఒక్కో కేంద్రానికి 10వేల సంచులను అందుబాటులో ఉంచినట్లు సంఘం సీఈవో రమేశ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నట్లు వివరించారు.