మూడు నెలల క్రితం అదృశ్యం..
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జిలుకర లింగయ్య(87) మూడు నెలల క్రితం అదృశ్యమయ్యాడు. మంగళవారం టేకుమట్ల మండలం బోర్నపల్లి శివారులోని చెరువులో అస్థికలు లభ్యం అయ్యాయి. లింగయ్య మతిస్థిమితం కోల్పోయాడు. మూడునెలల క్రితం ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పొరుగున ఉన్న టేకుమట్ల, చిట్యాల, ఓదెల, జమ్మికుంట, ముత్తారం మండలాల్లో లింగయ్య ఫొటోతో వాల్‌పోస్టర్లు వేశారు. లింగయ్య అస్థికలు, దుస్తులతో కూడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అవి.. తమ తండ్రివేనని కుమారుడు రమేశ్ గుర్తించాడు. అంతేకాదు.. బోర్నపల్లికి వెళ్లి అవి తన తండ్రి లింగయ్య వేనని నిర్ధారణ చేశాడు. దీంతో అక్కడి పోలీసులు వరంగల్ ఎంజీఎం ఫోరెనిక్స్ పంపించారు. మృతుడి అస్థికలను స్వగ్రామమైన మొట్లపల్లిలో రాత్రి ఖననం చేశారు. మృతుడికి కుమారుడు రమేశ్, కూతురు లక్ష్మి ఉన్నారు. మొట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్‌రావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.


