వార్డు కమిటీల జాడేదీ? | - | Sakshi
Sakshi News home page

వార్డు కమిటీల జాడేదీ?

Nov 18 2026 1:02 AM | Updated on Nov 18 2026 1:02 AM

వార్డు కమిటీల జాడేదీ? కుంటుపడుతున్న అభివృద్ధి..

కౌన్సిల్‌లో చర్చిస్తాం

కామారెడ్డి టౌన్‌: ‘మా వార్డు.. మా బాధ్యత’ అంటూ పట్టణ అభివృద్ధిలో ప్రజలను నేరుగా భాగస్వాములను చేసేందుకు రూపొందించిన ‘వార్డు కమిటీ’ వ్యవస్థ జిల్లాలో అటకెక్కింది. జిల్లాలోని ఏ బల్దియాలోనూ కమిటీలను ఏర్పాటు చేయలేదు. ప్రశ్నించే గొంతుకలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే బల్దియా పాలనలో పాలకవర్గాలు ప్రజలను దూరం పెడుతున్నాయన్న విమర్శలున్నాయి.

నాలుగు బల్దియాల పరిధిలో..

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 92 వార్డులున్నాయి. కామారెడ్డి బల్దియాలో 49, బాన్సువాడలో 19, ఎల్లారెడ్డిలో 12, బిచ్కుందలో 12 వార్డులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పురపాలక ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టి పది నెలలు గడిచాయి. ఏ మున్సిపాలిటీలోనూ వార్డు కమిటీల ఏర్పాటుపై కనీస కసరత్తు జరగలేదు.

నిబంధనల ప్రకారం..

బల్దియాలలో వార్డు కమిటీల ఏర్పాటు, విధులు, సమావేశాలపై తెలంగాణ మున్సిపాలిటీల చట్టంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ఆక్రమణల నివారణ వంటి స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి. వార్డు కమిటీలలో యువత, మహిళలు, వృద్ధులు, ఇతర ప్రముఖులు, స్థానిక అపార్ట్‌మెంట్లు, కాలనీల ప్రతినిధులకు చోటు కల్పించాలి. ఒక్కో కమిటీలో గరిష్టంగా 15 మంది ఉండొచ్చు. ఈ కమిటీల కాలపరిమితి ఏడాది. ప్రతి మూడు నెలలకోసారి కమిటీ సమావేశమై స్థానిక సమస్యలపై చర్చించి, వాటి వివరాలను తదుపరి కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ కమిటీలు ఏర్పాటైతే వార్డులో తమ పెత్తనానికి ఎక్కడ గండి పడుతుందోనని అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు కమిటీల ఊసే ఎత్తడం లేదు. తాము చేపట్టే పనులను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ఈ కమిటీలను వేదికగా చేసుకుంటారనే భయం కొందరిని వెన్నాడుతోందని, మరికొందరు కౌన్సిలర్లకు ఈ కమిటీల గురించి అవగాహన కూడా లేదని తెలుస్తోంది.

పాలనలో పౌర భాగస్వామ్యాన్ని పెంచేందుకు వార్డు కమిటీలు ఎంతగానో ఉపయోగపడతాయి. నిబంధనల మేరకు కమిటీల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై కౌన్సిల్‌ సమావేశంలో చర్చిస్తాం. అన్ని పార్టీల కౌన్సిలర్ల అభిప్రాయాలను తీసుకుని, నిబంధనల ప్రకారం అర్హులైన పౌరులతో అన్ని వార్డుల్లోనూ కమిటీలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం.

– పర్వతాలు, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

వార్డు కమిటీలు క్రియాశీలకంగా ఉంటే పాలక మండళ్ల పనితీరుపై ప్రజల పర్యవేక్షణ పెరుగుతుంది. నిధుల వినియోగం, పనుల నాణ్యతపై జవాబుదారీతనం ఉంటుంది. ఈ కీలక కమిటీలకు చట్టబద్ధత ఉన్నప్పటికీ పాలకమండళ్ల అనాసక్తి కారణంగా పౌర భాగస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితమైంది. జిల్లాలోని 92 వార్డుల్లో ఎక్కడా దీనిపై కసరత్తు కనిపించడం లేదు. కమిటీల ఊసే లేకపోవడంతో వార్డుల్లో పనుల తీరుపై ప్రశ్నించేవారు లేకుండాపోయారు. అధికారులు సైతం నిబంధనల అమలుపై దృష్టి సారించడం లేదని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కొత్త పాలకవర్గాలు

కొలువుదీరి 10 నెలలు..

కమిటీల ఊసెత్తని ప్రజాప్రతినిధులు

ప్రశ్నించే గొంతుకలు పెరుగుతాయనే

వెనకడుగు వేస్తున్నారని విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement