పనులు చేయిస్తాం
నాగిరెడ్డిపేట: పోచారం ప్రధాన కాలువలో పూడికతీత, కాలువకు ఇరువైపులా పిచ్చిమొక్కల తొలగింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో చివరి ఆయకట్టుకు సరిగా నీరందడం లేదు. పోచారం ప్రాజెక్టు గేట్ల నుంచి మండలంలోని తాండూర్ వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువలో పూడికతీతతోపాటు కాలువకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లు, పొదల తొలగింపు కోసం గతేడాది జూన్‌లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద రూ.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ ప్రధాన కాలువలో పూడికతీత పనులు ప్రారంభించారు. అయితే గతేడాది ఖరీఫ్‌లో పంటల సాగు ప్రారంభం కావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. వానాకాలం పంటల సాగు పూర్తయ్యాక కొన్నాళ్లు పనులు సాగాయి. తిరిగి యాసంగి పంటల సాగుతో మరోసారి బ్రేక్ ఏర్పడింది. నెలరోజుల క్రితం కాంట్రాక్టర్ కాలువకు ఇరువైపులా చెట్లు, పొదల తొలగింపు పనులు ప్రారంభించినప్పటికీ కాలువకట్టకు ఒకవైపు ఉన్న చేతికొచ్చిన వరిపంటల వల్ల పూడికతీత పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పనులు మళ్లీ నిలిచిపోయాయి.
త్వరగా పూర్తి చేస్తే..
ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో పంటల సాగు పూర్తయ్యింది. కాలువలో పూడికతీతతోపాటు చెట్లు, పొదల తొలగింపునకు ఇది అనుకూల సమయం. కాంట్రాక్టర్ వెంటనే పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. పూడికతీస్తే ప్రాజెక్టు నుంచి విడుదల చేసే సాగునీరు చివరి ఆయకట్టు భూములకు చేరుతుందని పేర్కొంటున్నారు.
డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో..
పోచారం ప్రధాన కాలువకు ఉన్న డిస్ట్రిబ్యూటరీ కాలువలు పలుచోట్ల ఆనవాళ్లు కోల్పోయాయి. వీబీజీ రాంజీ పథకం ద్వారా కాలువల్లోని పూడిక, పిచ్చిమొక్కల తొలగింపు పనులు చేపట్టాలని ఇటీవల ఇరిగేషన్ అధికారులు ఎంపీడీవోకు లేఖ రాశారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలలో పూడిక తీయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
పోచారం ప్రధాన కాలువలో పూడికతీతతోపాటు కాలువకు ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్లు, పొదల తొలగింపు పనులు 40 శాతం వరకు పూర్తయ్యాయి. పంటల సాగుతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగు పూర్తయినందున మళ్లీ పనులు ప్రారంభించి, త్వరగా పూర్తయ్యేలా చూస్తాం.
– వెంకటేశ్వర్లు, ఈఈ, ఇరిగేషన్, ఎల్లారెడ్డి
పోచారం కాలువలో పూడికతీతకు
ఏడాది క్రితం నిధులు
నత్తనడకన కొనసాగుతున్న పనులు
చివరి ఆయకట్టుకు అందని నీరు


