మల్కాపూర్‌ శివారులో విచారణ | - | Sakshi
Sakshi News home page

మల్కాపూర్‌ శివారులో విచారణ

Nov 18 2026 1:02 AM | Updated on Nov 18 2026 1:02 AM

మల్కాపూర్‌ శివారులో విచారణ ‘గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి’ నేడు బల్దియా సర్వసభ్య సమావేశం దరఖాస్తుల ఆహ్వానం

పెద్దకొడప్‌గల్‌: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ రెవెన్యూ పరంగా మరో మండలం పరిధిలో ఉండడంతో మల్కాపూర్‌ శివారు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించారు. ఈ సమస్యపై ‘మల్కాపూర్‌ శివారుకు సరిహద్దు సంకెళ్లు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. భూ రికార్డుల సవరణలైనా, ఎరువుల కోసమైనా, ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియకైనా మల్కాపూర్‌ రైతులు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిచ్కుందకు వెళ్లాల్సి వస్తున్న విషయాన్ని ఈ కథనం కళ్లకు కట్టింది. దీనిపై కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తహసీల్దార్‌ రాజశేఖర్‌ను ఆదేశించారు. దీంతో ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాస్తవ పరిస్థితులతో కూడిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని తహసీల్దార్‌ తెలిపారు.

కామారెడ్డి టౌన్‌: ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేస్తూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని సర్పంచులు, పంచాయతీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. వీబీజీ రామ్‌జీ అమలు, దాని ప్రయోజనాలపై సమీక్షించారు. అర్హులైన వారినే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ఎంపికనే తుది నిర్ణ యం కాదన్నారు. ఇష్టం వచ్చినట్లు గ్రామ కార్యదర్శులను మార్చవద్దని సూచించారు. ఇక మండల సమీక్ష సమావేశాలకు స్వయంగా హాజరవుతానని, అక్రమాలు, అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కామారెడ్డి టౌన్‌: ఈనెల 13న వాయిదా పడిన కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు బల్దియా అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ హాలులో ఈ సమావేశం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. బల్దియాలో అవినీతి, అక్రమాలతో పాటు వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలపై కౌన్సిల్‌ సభ్యులు పాలకవర్గాన్ని నిలదీసే అవకాశాలున్నాయి.

కామారెడ్డి టౌన్‌: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఖాళీగా ఉన్న 60 పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో వెంకట్‌ తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులను కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అందించాలని సూచించారు. ఒక్కో పోస్టుకు దరఖాస్తు రుసుము రూ.500 లని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర నిబంధనల కోసం www.kamareddy.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

అర్హులకు సంక్షేమ పథకాలు

రుద్రూర్‌: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పొతంగల్‌, కోటగిరి, రుద్రూర్‌ మండల కేంద్రాల్లో మంగళవారం చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement