భిక్కనూరు: వారంతా ఒక్కచోట చదివి, సుమారు 50 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు భిక్కనూరు జెడ్పీహెచ్ పూర్వ విద్యార్థులు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 1974–75 బ్యాచ్ పదో తరగతి 21మంది పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.


