20వ రోజుకు చేరిన సమ్మె | - | Sakshi
Sakshi News home page

20వ రోజుకు చేరిన సమ్మె

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

20వ రోజుకు చేరిన సమ్మె కబడ్డీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఇజ్రాయెల్‌–తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రకాశ్‌ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

కామారెడ్డి టౌన్‌: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో ఉద్యోగులు దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. ‘మా కష్టంతో ప్రజారోగ్య దీపాన్ని వెలిగించాం.. మా బతుకుల దీపానికి భద్రత అడుగుతున్నాం’ అంటూ నినాదాలు చేశారు. సమ్మె శిబిరాన్ని తెలంగాణ రచయితల వేదిక నాయకులు గఫూర్‌ శిక్షక్‌,గంగా ప్రసాద్‌, సంధ్యారాణి, సావిత్రిలు సందర్శించి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు సుమన్‌, నాయకులు అశ్విని, వేణుమాధవ్‌, రాహుల్‌, మౌనిక, మీనాక్షి, చంద్రకాంతం, జ్యోతి, సుశీల, అఖిల్‌, సుకన్య, శేఖర్‌, లింగం తదితరులు పాల్గొన్నారు.

వేల్పూర్‌(ముప్కాల్‌): ముప్కాల్‌ మండల కేంద్రంలోని భూదేవి ఇండోర్‌ స్డేడియంలో నిర్వహించే బాలుర కబడ్డీ (అండర్‌ 16 సబ్‌జూనియర్‌) శిక్షణకు ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు లింగయ్య, గంగాధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2010 డిసెంబర్‌ 13 తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ మెమోతో గురువారం ఉదయం 10 గంటలలోపు రిపోర్టు చేయాలన్నారు. 22 మంది క్రీడాకారులతో ప్రాబబుల్స్‌ తీసుకొని, శిక్షణ ఇస్తారని, 14 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారన్నారు. ఈనెల 12 నుంచి 14 వరకు వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడల్లో వీరు పాల్గొంటారని వెల్లడించారు.

వేల్పూర్‌: వేల్పూర్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన నీరటి ప్రకాశ్‌ ఇజ్రాయెల్‌ దేశంలో ఇజ్రాయెల్‌–తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇజ్రాయెల్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌తోపాటు, ఎక్కువ మంది ప్యానల్‌ సభ్యులు విజయం సాధించినట్లు మీడియాకు వెల్లడించారు. ఉపాధ్యక్షుడిగా కరణ్‌గౌడ్‌, కోశాధికారిగా సందీప్‌, ప్రధాన కార్యదర్శిగా శివగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ ప్యానల్‌పై నమ్మకముంచి ఘన విజయాన్ని అందించిన తెలంగాణవాసులకు ప్రకాశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

డిచ్‌పల్లి: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల జరిగిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ అండర్‌–14 బాయ్స్‌, గర్‌ల్స్‌ టోర్నమెంట్‌ కం సెలెక్షన్‌ పోటీలు జరిగాయి. వీటిలో నిజామాబాద్‌ జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ అలివేణి మంగ చేతుల మీదుగా జట్టు క్రీడాకారిణులు మెడల్స్‌ అందుకున్నారు. జట్టులో చక్కని ప్రతిభ చూపిన క్రీడాకారిణులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు మంగ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement