ఐదేళ్లుగా అసంపూర్తిగానే గ్రంథాలయ భవనం! | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లుగా అసంపూర్తిగానే గ్రంథాలయ భవనం!

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

పెద్దకొడప్‌గల్‌: యువతలో పఠనాసక్తిని పెంపొందించాల్సిన గ్రంథాలయం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఐదేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన నూతన గ్రంథాలయ భవన నిర్మాణం నేటికీ పూర్తికాకపోవడంతో పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు. రూ. లక్షలాది నిధులు మంజూరైనా పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం స్థానికుల అసంతృప్తికి కారణమవుతోంది. 1980లో ప్రారంభమైన గ్రామీణ గ్రంథాలయం నేటికీ గ్రామ ధర్మశాలలోనే కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ముందుకు సాగని పనులు

పెద్దకొడప్‌గల్‌లో 1980లో గ్రామీణ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి గ్రామ ధర్మశాలలోనే పుస్తక పఠనం కొనసాగుతోంది. అయితే కాలక్రమేణా ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రంథాలయానికి సొంత భవనం నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా 2021లో నాటి ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే రూ. ఐదు లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులతో భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మరో రూ. ఐదు లక్షలు మంజూరయ్యాయి. మొత్తం రూ. పది లక్షల నిధులు కేటాయించినా నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తి భవనం అలాగే దర్శనమిస్తోంది. గ్రంథాలయంలో పాత పుస్తకాలే అందుబాటులో ఉన్నాయని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు అవసరమైన పుస్తకాలు, దినపత్రికలు, ఇతర సమాచార వనరులు కల్పించాల్సిన అవసరం ఉందని పాఠకులు పేర్కొంటున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తిచేయడంతో పాటు గ్రంథాలయానికి కొత్త పుస్తకాలు సమకూర్చాలని కోరుతున్నారు.

నిధులు మంజూరైనా పూర్తికాని

నిర్మాణ పనులు

ధర్మశాలలోనే కొనసాగుతున్న పరిస్థితి

శిథిలావస్థకు చేరిన పాత భవనం..

ఇబ్బందిపడుతున్న పాఠకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement