ముగిసిన పదవీకాలం..
రేసులో పలువురు సీనియర్లు..
● ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు
● దీపావళిలోగా భర్తీ చేస్తారన్న సంకేతాలు
● ఆశావహుల్లో ఉత్సాహం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి కావస్తున్నందున ఈసారి తప్పకుండా నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందని కొందరు నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో చాలాకాలంగా ఆయా పదవుల కోసం ఎదురుచూస్తున్న వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీపావళికి తీపి కబురు ఉంటుందన్న సంకేతాలతో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.
ఒకరిద్దరికే దక్కిన పదవులు..
కామారెడ్డి నియోజకవర్గంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి తప్ప మరెవరికీ జిల్లా, రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ అవకాశాలు రాలేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సీడీసీ చైర్మన్ పదవి తప్ప మరో పదవులు దక్కలేదు. జుక్కల్ నియోజక వర్గంలో కూడా ఏ ఒక్కరికీ నామినేటెడ్ అవకాశాలు రాలేదు. బాన్సువాడ నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి. రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన సీనియర్ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డికి ఇటీవలే కాంగ్రెస్ పంచాయతీరాజ్ సంఘటన్‌లో రాష్ట్ర స్థాయి పదవి దక్కింది. ఆయన గతంలో నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నించారు. ఇటీవల సహకార సంఘాలకు పాలక వర్గాలను నామినేట్ చేస్తున్నారు. దీంతో మండల స్థాయిలో నేతలు పలువురికి పదవులు దక్కాయి. పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవీ కాలం కూడా ముగియనుండడంతో కొత్తవారికి అవకాశం ఇస్తారా? పాత వారినే కొనసాగిస్తారా అన్న అంశంపై జిల్లాలో చర్చ నడుస్తోంది.
కై లాస్‌కు అవకాశం దక్కేనా?
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేసిన కై లాస్ శ్రీనివాస్‌రావ్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. పలుమార్లు ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయినప్పటికీ ఆయనకు పదవి మాత్రం దక్కలేదు. తన రాజకీయ గురువు షబ్బీర్‌అలీ ద్వారా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కై లాస్ శ్రీనివాస్‌రావుకు నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని షబ్బీర్‌అలీ పలు వేదికల మీద ప్రకటించారు. ఈ మధ్య కూడా కై లాస్‌కు పదవి ఖాయమనే మాట వచ్చింది. ఈసారి అవకాశం దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో పదవులు పొందిన పలువురి పదవీ కాలం ముగిసిపోయింది. వారికి తిరిగి రెన్యువల్ కాలేదు. కొత్త వారికీ అవకాశం కల్పించకుండా ఆయా పోస్టులను పెండింగ్‌లోనే పెట్టారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి బాన్సువాడకు చెందిన సీనియర్ నేత కాసుల బాల్‌రాజ్ ఒక్కరినే వరించింది. ఆయన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్‌గా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగారు. ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. మరోసారి అవకాశం దక్కుతుందని ఆశించినా.. ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడతో మాజీ అయ్యారు.
కామారెడ్డికి చెందిన న్యాయవాది దేవరాజ్‌గౌడ్ సైతం కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నించారు. రెండుమూడేళ్లుగా ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి వెన్నంటి ఉండి ఎన్నికల ఏర్పాట్లలో చురుకుగా పనిచేశారు. ఆయన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవుల రేసులో పలువురు సీనియర్ నేతలున్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన పండ్ల రాజు ఫిషరీష్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ద్వారా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భిక్కనూరు మండలానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిని ఆశించినా ఆయనకు పార్టీ పదవితో సరిపెట్టారు. ఇటీవల రామేశ్వర్‌పల్లిలో సింగిల్ విండో చైర్మన్‌గా నామినేట్ అయ్యారు. ఆయన జిల్లా సహకార సంఘంలో కీలక పదవిని ఆశిస్తున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే నామినేటెడ్ పదవుల పందేరం ఉంటుందన్న ప్రకటనలు వచ్చినపుడల్లా ఉత్సాహంగా తిరగడం, వాయిదా పడ్డాయనగానే నీరసపడడం పరిపాటిగా మారింది. ఈసారైనా భర్తీ చేస్తారా లేక షరామామూలుగా వాయిదా వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
దీపావళి పండుగలోగా నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందన్న ప్రచారంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. పండుగకు ముందో, వెనకో ఆయా పోస్టులను భర్తీ చేస్తారన్న ఆశతో పలువురు నేతలు ఉన్నారు. అవకాశం కోసం గాడ్‌ఫాదర్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


