కుక్కపిల్ల అపహరణ.. గంటలో పట్టుకున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

కుక్కపిల్ల అపహరణ.. గంటలో పట్టుకున్న పోలీసులు

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

కుక్కపిల్ల అపహరణ.. గంటలో పట్టుకున్న పోలీసులు ‘పోచారం’లో 0.984 టీఎంసీల నీరు నిల్వ అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నవంబర్‌ 4న జిల్లా స్థాయి యువజనోత్సవం నేడు జిల్లాకు ఏఐసీసీ పరిశీలకుడి రాక

కామారెడ్డి టౌన్‌ : తన పెంపుడు కుక్క అపహరణకు గురైందంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కామారెడ్డి పోలీసులు గంట వ్యవధిలోనే కేసును ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా కాలనీకి చెందిన విద్యార్థి రెడ్డిపేట మణికృష్ణ గౌడ్‌ నల్లటి లాబ్రడార్‌ జాతి కుక్కపిల్లను పెంచుకుంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం పట్టణంలోని ఎన్‌ఆర్‌ ప్యాలెస్‌ సమీపంలోని ఓ దుకాణం ఎదుట గుర్తుతెలియని మహిళ అపహరించి స్కూటీపై తీసుకువెళ్లింది. దీంతో అతడు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి కుక్కపిల్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో యజమాని మణికృష్ణ గౌడ్‌కు అప్పగించారు. ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే తన పెంపుడు కుక్కను అప్పగించినందుకు అతడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి 0.984 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్‌ ఏఈ అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది పోచారం ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటలసాగు కోసం ఆగస్టు 7వ తేదీన నీటి విడుదల ప్రారంభించారు. నీటి విడుదల నిరంతరాయంగా కొనసాగింది. ఆయకట్టు పరిధిలో పంటల సాగు పూర్తి కావడంతో ఈనెల 25న నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా ఉందని ఏఈ తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో పీజీ సోషల్‌వర్క్‌ పాఠ్యంశం బోధించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. రెండు అతిథి అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నామని, ఆసక్తిగలవారు బుధవారం సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని, 29న ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు.

కామారెడ్డి టౌన్‌ : యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు నవంబర్‌ 4న స్థానిక కళాభారతి ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌వో రంగ వెంకటేశ్వర్‌ గౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా జానపద నృత్యం, జానపద గానం, చిత్రలేఖనం, కవితా రచన, వీధి నాటకం విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువతీయువకులు అర్హులని తెలిపారు. ఆయా విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచినవారిని హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు, అక్కడ ప్రతిభ చూపితే 2027 జనవరిలో న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయ యువజనోత్సవాలకు అర్హులవుతారని పేర్కొన్నారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు, యువజన సంఘాలు చొరవ తీసుకుని యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని ఆయన కోరారు.

కామారెడ్డి టౌన్‌ : ‘ఓటు బచావో – దేశ్‌ బచావో’ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే జేఎంహెచ్‌ ఆసన్‌ మౌలానా మంగళవారం జిల్లా కేంద్రానికి రానున్నారని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లాలోని బ్లాక్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మహిళా కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement