ఏటీఎం దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్‌

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

రాజస్థాన్‌లో వేట..

● పరారీలో మరో ముగ్గురు

● వాహనం, నగదు స్వాధీనం

● ఎస్పీ రాజేశ్‌ చంద్ర వెల్లడి

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గ్యాస్‌ కట్టర్‌లతో ఏటీఎంలను ధ్వంసం చేసి డబ్బులు లూటీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. గాంధారి ఏటీఎం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన రషీద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఈనెల 10 అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధారిలోని ప్రధాన రహదారిపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్‌ కట్టర్లతో ధ్వంసం చేసిన దొంగలు.. రూ. 25.45 లక్షల నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. మహిళల నైటీలు ధరించిన దొంగలు తలను, ముఖాన్ని కప్పేసుకుని, చేతులకు గ్లౌజులు తొడుక్కుని వచ్చి 12 నిమిషాల్లో ఏటీఎంను ధ్వంసం చేసి నగదుతో తాము తెచ్చుకున్న వాహనంలో పరారయ్యారు. ఈ ముఠాను పట్టుకునేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌కుమార్‌, పిట్లం ఎస్సై ఆంజనేయలు, సదాశివనగర్‌ ఎస్సై పుష్పరాజ్‌, ఇతర అధికారులతో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాహనం గుర్తింపు సమాచారంతో ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయం చేసుకుంటూ గాలింపు చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏటీఎంల చోరీలకు పాల్పడిన ఈ ముఠా.. నలుపురంగు స్కార్పియో వాహనాన్ని వాడుతూ పోలీసుల కళ్లుగప్పేందుకు అసలు రిజిస్ట్రేషన్‌ నంబరు ప్లేట్లకు బదులుగా ఇతర వాహనాల నంబర్‌ ప్లేట్లను మారుస్తూ తిరుగుతున్నట్టు గుర్తించారు.

వెల్డింగ్‌ షాప్‌ సామగ్రి దొంగలించి..

ఈనెల 10న గాంధారి మండల కేంద్రానికి వచ్చిన దొంగల ముఠా వెల్డింగ్‌ షాప్‌ తాళాలు పగులగొట్టి సిలిండర్‌తోపాటు అవసరమైన సామగ్రిని దొంగిలించారు. ప్రధాన రోడ్డుపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్కులు, క్యాప్‌లు, నైటీలు ధరించారు. ఏటీఎం సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటిపై నలుపురంగు స్ప్రే వాడి గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. ఏటీఎంలో ఉన్న నోట్లకు సంబంధించిన ఐదు బాక్సులను వాహనంలో వేసుకొని పరారయ్యారు.

కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసు ప్రత్యేక బృందాలు.. నేరస్తులు వాడిన వాహనం ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లిందనేది గుర్తించి పొరుగు రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారు. రాజస్థాన్‌లోని చేదాట్‌ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి, బారికేడ్లు, రోడ్డు నిరోధక పరికరాల సాయంతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎడమవైపు టైరు దెబ్బతినడంతో నిందితులు కొంత దూరం వెళ్లి వాహనాన్ని వదిలిపెట్టి నగదు ఉన్న బ్యాగుతో పరారయ్యారు. కామారెడ్డి నుంచి పోలీసు అధికారుల బృందాలు రాజస్థాన్‌కు వెళ్లి నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 20న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాజస్థాన్‌ రాష్ట్రంలోని బరోడామేవ్‌ సమీపంలో భరత్పూర్‌ రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న నిందితుడు రషీద్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి, ట్రాన్సిట్‌ వారెంట్‌పై కామారెడ్డికి తీసుకువచ్చామని ఎస్పీ తెలిపారు. చోరీకి ఉపయోగించిన వాహనం, పరికరాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల నుంచి రూ.29,400 స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌కుమార్‌, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజ్‌, పోలీసు సిబ్బంది శ్రీనివాస్‌, లక్ష్మీకాంత్‌, అజార్‌లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement