● 24 గంటల్లో నిందితుడిని
పట్టుకున్న పోలీసులు
మాచారెడ్డి: వృద్ధురాలిని బెదిరించి ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన నిందితుడిని పోలీసులు 24 గంటల్లో పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. గజ్యానాయక్ తండా (మాచారెడ్డి)చౌరస్తాకు చెందిన అగుళ్ల ఈరమ్మ బుధవారం కల్లు దుకాణం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మందులకు పనికొచ్చే చెట్టు కొమ్మ చూపిస్తానని నమ్మించి ఆమెను ఆటోలో ఎక్కించుకొని చుక్కాపూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఈరమ్మను బెదిరించి, కొట్టి, ఆమె వద్ద ఉన్న వెండి కడియాలు, బంగారు ముక్కుపుడకతోపాటు సంచిలోని కొంత నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో రూరల్ సీఐ శ్రీధర్ రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా ప్రాంతంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన ఆలకుంట అలియాస్ దండుగుల సాయిలుగా గుర్తించారు. వ్యక్తిగత ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడం, సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దర్యాప్తుకు కృషి చేసిన ఎస్సై విజయ్, సిబ్బందిని ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.


