జార్ఖండ్‌లో నాచుపల్లి తండావాసి మృతి | - | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో నాచుపల్లి తండావాసి మృతి

Oct 18 2026 1:00 AM | Updated on Oct 18 2026 1:00 AM

నస్రుల్లాబాద్‌: ఉద్యోగ రీత్యా జార్ఖండ్‌లో ఉంటున్న నస్రుల్లాబాద్‌ మండలం నాచుపల్లి తండాకు చెందిన మూడ్‌ సుధాకర్‌(19) శనివారం బావిలో పడి మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. సుధాకర్‌కు రెండేళ్ల క్రితం జార్ఖండ్‌ రాష్ట్రంలోని సాయిబాస తాలూకా, చింపాని గ్రామంలో బీపీఎంగా ఉద్యోగం వచ్చింది. దీంతో అక్కడే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే సుధాకర్‌ ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

వర్ని: మోస్రా–కొత్తపేట్‌ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోస్రాకు చెందిన సంజయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్‌ నుంచి మోస్రాకు వస్తుండగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. సంజయ్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు.

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

ఇందల్వాయి: చంద్రాయన్‌పల్లి గ్రామ శివారులో 44వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం కంటైనర్‌ లారీ బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. కంటైనర్‌ లారీ హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌ వైపు వెళ్తోందని, చంద్రాయన్‌పల్లి శివారులో కల్వర్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని వారు తెలిపారు.

వడ్డీ వ్యాపారస్తులపై కొరడా

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారస్తులపై శనివారం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. 67 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు 42 చోట్ల చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్‌ పేపర్స్‌, నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. మాక్లూర్‌ మండల కేంద్రంలోని కిరాణాషాప్‌ యజమాని, సిరికొండ మండలంలోని బెజ్జోరా, భీమ్‌గల్‌ మండల కేంద్రం, జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌ కాలనీ, పొతంగల్‌, కోటగిరిలో పోలీసులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అప్పులు తీసుకున్న వారిని వేధింపులకు గురిచేస్తే పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.

చెట్లు నరికిన ఒకరికి జరిమానా

ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని మెఘ్యానాయక్‌ తండాలో శనివారం జరిపిన తనిఖీల్లో రెండు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్‌ అధికారి రవి మోహన్‌ భట్‌ తెలిపారు. తండాకు చెందిన అంబర్‌సింగ్‌ సమీప అడవిలో టేకు దుంగలను నరికి ఇంట్లో దాచిపెట్టినట్లు పేర్కొన్నారు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రూ.6 వేల జరిమానా విధించి, కలపను రేంజ్‌ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.

వ్యవసాయ విద్యుత్‌ కేబుల్‌ వైర్ల చోరీ

జక్రాన్‌పల్లి: మండలంలోని మనోహరాబాద్‌ గ్రామ రెవెన్యూ శివారులోని ఎర్రకుంట్లలో వ్యవసాయ మోటార్ల వద్ద కేబుల్‌ వైర్లను దుండగులు ఎత్తుకెళ్లారు. సుమారు 45 మంది రైతుల వ్యవసాయ మోటార్లకు ఉన్న కేబుల్‌ వైర్లను కట్‌ చేసుకొని అపహరించారని రైతులు గంగారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. దుండగులను పట్టుకొని శిక్షించాలని రైతులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement