బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 12వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ప్రారంభించిన ఎన్సీసీ కెడెట్ల వార్షిక శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. శిబిరంలో కెడెట్లను నాలుగు కంపెనీలుగా విభజించి పది రోజులపాటు ఆయుధ శిక్షణ, డ్రిల్, శారీరక దృఢత్వం, ఫీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్, మిలిటరీ సబ్జెక్టు అంశాలపై శిక్షణనిచ్చారు. రిపబ్లిక్ డే క్యాంప్కు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి బెటాలియన్ల పరిధిలోని కెడెట్ల నుంచి నిజామాబాద్ గ్రూప్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. యువ ఆపద మిత్ర పథకంలో భాగంగా 75 మందిని ఎంపిక చేసి, వారికి ప్రత్యేకంగా విపత్తుల నిర్వహణ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధానాలను, ప్రజలకు సహాయం అందించడంపై శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ముగింపు వేడుకల్లో కెడెట్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎన్సీసీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు ప్రసాద్నాయర్, ఏసీపీ రాజశేఖర్, శ్రీనివాస్, క్యాంప్ అధికారులు, ఉద్యోగులు సుమారు 550 మంది ఎన్సీసీ కెడెట్లు పాల్గొన్నారు.


