పండుగల వేళ దొంగలకు చాన్స్‌ ఇవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

పండుగల వేళ దొంగలకు చాన్స్‌ ఇవ్వొద్దు

Oct 18 2026 1:00 AM | Updated on Oct 18 2026 1:00 AM

● నగదు, నగలు బ్యాంకు లాకర్లలో

భద్రపరచుకోవాలి

● ప్రయాణాల్లో అతివేగం వద్దు

● జిల్లా ప్రజలకు ఎస్పీ రాజేశ్‌చంద్ర సూచనలు

కామారెడ్డి టౌన్‌: దసరా, బతుకమ్మ పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించి దొంగలకు అవకాశం ఇవ్వొద్దని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. శనివారం ఆయన మాట్లాడారు. కుటుంబ సభ్యులతో పండుగ ఆనందాన్ని పంచుకోవడానికి వెళ్లేవారు బయలుదేరే ముందు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇస్తే కాలనీల్లో గస్తీ ముమ్మరం చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రజల ఆస్తుల పరిరక్షణ, శాంతిభద్రతల నిర్వహణ పోలీసు శాఖ బాధ్యతని, అయితే ప్రజల స్వీయ జాగ్రత్తలు కూడా అంతే కీలకమన్నారు. ఇంట్లో అధిక మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు ఉంచకుండా సాధ్యమైనంత వరకు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలన్నారు. ప్రయాణమయ్యే ముందు నమ్మకమైన ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి, ఇంటి పరిసరాలను గమనిస్తూ ఉండాలని చెప్పాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొబైల్‌ ఫోన్‌ ద్వారా పర్యవేక్షించేలా కనెక్ట్‌ చేసుకోవాలని కోరారు. చాలామంది తాము ఊరెళ్తున్నామని, ఫలానా తేదీ వరకు ఉండమని సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా పోస్టులు పెడుతుంటారని, దీనివల్ల నేరస్తులకు సమాచారం సులువుగా చేరుతుందని, ప్రయాణ వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టొద్దన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్‌ 112కు ఫోన్‌ చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, కార్లలో ప్రయాణించేవారు సీట్‌ బెల్ట్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement