బాన్సువాడ : ప్రజలు సొంతింటి కల నెరవేర్చుకునే క్రమంలో ఫైనాన్స్‌లను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కమీషన్ ఇస్తే చాలు పనంతా తామే చేస్తామని చెబుతూ ఏజెంట్లు వక్రమార్గంలో రుణాలు ఇప్పిస్తున్నారు. ఆ తర్వాత ఒక్క నెల వాయిదా చెల్లించకపోయినా ఆయా సంస్థల ప్రతినిధులు ఇళ్లకు వచ్చి మానసికంగా వేధిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.
బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్ల ద్వారా ఇంటి నంబర్ల దందా జోరుగా సాగుతోంది. లే అవుట్ లేకుండానే ఇళ్లు నిర్మించుకున్న యజమానులకు అక్రమ మార్గాల ద్వారా ఇంటి నంబర్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా యజమానుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించి ఫైనాన్సులో రుణాలు ఇప్పిస్తున్నారు. ఈ ఏడాది ఇంటి నంబర్ల ఆధారంగానే 600లకు పైగా రిజిస్ట్రేషన్లు అయినట్లు తెలుస్తోంది.
జిల్లాలో ప్రయివేటు ఫైనాన్స్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒక్క బాన్సువాడ పట్టణంలోనే 20కి పైగా ఫైనాన్స్‌లున్నాయి. పదుల సంఖ్యలో ఏజెంట్లను నియమించి రుణాలు ఇస్తూ అదే క్రమంలో కిస్తీలను వసూలు చేస్తున్నాయి. వ్యాపారాలు చేసుకునే వారు ఎలాగోలా కిస్తీలు కడుతున్నా.. కొందరు వ్యవసాయ కూలీలు, కూలీలు అప్పులు తీసుకొని కిస్తీలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ కూలీలు పనులు దొరక్క కిస్తీలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కీస్తీలు కట్టని వారిని రికవరీ ఏజెంట్లు మానసికంగా వేధిస్తున్నారు. దీంతో రుణాలు తీసుకున్నవారు నలిగిపోతున్నారు. ఇంటి నంబర్ల దందా విషయమై నస్రుల్లాబాద్ ఎంపీవో సూర్యకాంత్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు.
జోరుగా ఇంటి నంబర్ల దందా
కమీషన్ ఇస్తే చాలు పనంతా ఏజెంట్లదే!
ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు..
ఫైనాన్సుల్లో తనఖా పెట్టి లోన్లు..
అప్పుల ఊబిలో పేదలు
బస్వాయిపల్లికి చెందిన పిట్లం విఠల్(28) తీసుకున్న రుణం డబ్బులు కట్టకపోవడంతో ఫైనాన్స్ ప్రతినిధులు అతడి ఇంటిని సీజ్ చేశా రు. దీంతో మనస్తాపానికి గురైన విఠల్ ఇటీవ ల ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గతేడాది ఇంటి రుణం కోసం నస్రుల్లాబాద్ మండలానికి చెందిన ఓ వ్యక్తి పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న సదరు కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


