ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం అడివిలింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు పిల్లలమర్రి శివనర్సింహారావు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. రెండేళ్ల క్రితం ఖమ్మం జిల్లా నుంచి పదోన్నతిపై అడివిలింగాలకు వచ్చిన నర్సింహారావు విద్యార్థుల సంఖ్యను 50 శాతం పెంచారు. దాతల సహకారంతోపాటు తన వంతు ఆర్థిక సాయంతో పాఠశాలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారు. రెండు సంవత్సరాలుగా పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సైకిళ్లు బహూకరించడంతోపాటు పరీక్ష ప్యాడ్స్, ట్రోజర్స్, టీషర్టులు, షూస్ అందిస్తున్నారు. ప్రతి ఐదుగురు విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని చదువులో ముందుకు తీసుకొస్తున్నారు.


