మాచారెడ్డి: మారుమూల తండాకు వెళ్లి విద్యాదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు పాత తండా పాఠశాల ఉపాధ్యాయుడు పాతకాల కిషన్. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో 19 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండేవారు. ఒక ఉపాధ్యాయుడు పదోన్నతిపై బదిలీ కావడంతో ఒక్క ఉపాధ్యాయుడే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కిషన్ సొంత ఖర్చులతో ఒక విద్యావలంటీర్‌ను నియమించి బోధన సాగిస్తున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను 32 మందికి పెంచారు. సొంత డబ్బులతో నోటు పుస్తకాలు కొనుగోలు చేసి అందజేస్తున్నారు.


