సదాశివనగర్: ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని జెడ్పీ సీఈవో చందర్‌నాయక్ సూచించారు. శుక్రవారం ఉత్తునూర్‌లో బోర్‌వెల్ రీచార్జింగ్ గుంతలు, ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. పనులలో వేగం పెంచాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఎంపీడీవో సంతోష్‌కుమార్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గైని రాజయ్య, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి తదితరులున్నారు.
బాన్సువాడ రూరల్: బోర్లం రోడ్డులో కల్కిచెరువు పక్కన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి పరిశీలించారు. త్వరలోనే భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో చేయూత పింఛన్ల పంపిణీ కోసం శుక్రవారం అదనపు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఒకే కౌంటర్ ఉండడంతో పింఛన్ కోసం వృద్ధులు పడుతున్న అవస్థలపై శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు. వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అదనంగా మరో కౌంటర్ ఏర్పాటు చేసి పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాడ్వాయి: యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తాడ్వాయి మండలంలో ఇప్పటివరకు 56,550 సంచుల యూరియా పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇందులో తాడ్వాయి సొసైటీ ద్వారా 26108 బస్తాల యూరియా అందించామని తెలిపారు. ఈనెల 25న యూరియా కోసం ఇండెంట్ పెట్టినా తాడ్వాయి సొసైటీ డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా కాలేదని పేర్కొన్నారు. 27న డబ్బులు చెల్లించడంతో 1,332 బస్తాల యూరియాను పంపించామని వివరించారు.
కామారెడ్డి అర్బన్: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం ఆయన జయంతి నేపథ్యంలో స్థానిక ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హాకీకి ధ్యాన్‌చంద్ అందించిన సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్, అకాడమీ కోచ్ సందీప్‌గౌడ్, ప్రతినిధులు ఎస్.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, నగేష్‌షా, గంగారెడ్డి, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
3న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీకి వచ్చేనెల 3న స్పాట్ అడ్మిషన్లు నిర్వహింనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 31 నుంచి సెప్టెంబరు 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు.


