సమస్యలపై చర్చ జరిగేనా? | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై చర్చ జరిగేనా?

Aug 29 2026 1:16 AM | Updated on Aug 29 2026 1:16 AM

సమస్యలపై చర్చ జరిగేనా?

సజావుగా సాగేనా?

అధ్వానంగా రోడ్లు, డ్రెయినేజీలు..

నేడు కామారెడ్డి బల్దియా సమావేశం

9 అంశాలతో ఎజెండా

పుర ప్రధాన సమస్యలకు దక్కని చోటు

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి బల్దియా అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన శనివారం నిర్వహించనున్నారు. 9 అంశాలతో అధికారులు ఎజెండాను సిద్ధం చేశారు. అయితే పట్టణాన్ని వేధిస్తున్న ప్రజా సమస్యలకు ఎజెండాలో చోటు దక్కకపోవడంపై కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలా?

పట్టణంలోని 49 వార్డుల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చెత్త సేకరిస్తున్నారు. దీనిని ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించి, ప్రతి ఇంటి నుంచి యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని బల్దియా యోచిస్తోంది. ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు రకాల పన్నుల భారంతో ఇబ్బందిపడుతున్న పట్టణ ప్రజలపై చెత్త సేకరణ పేరుతో అదనపు భారాన్ని మోపవద్దని కోరుతున్నారు.

చికెన్‌, మటన్‌ వ్యర్థాల నిర్వహణను కూడా టెండర్‌ ద్వారా ప్రైవేటుకు అప్పగించే ప్రతిపాదన పెట్టారు.

ఎజెండాలోని అంశాలు..

ఎస్‌బీఎం 2.0 కింద రూ. 5.34 కోట్లతో యంత్రాల కొనుగోలు, రూ. 20 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం అంశాలను ఎజెండాలో చేర్చారు. 15వ ఆర్థిక సంఘం (రూ.2.39 కోట్లు), ఎస్‌ఎఫ్‌సీ (రూ.1.49 కోట్లు) ని ధులతో స్వచ్ఛ ఎలక్ట్రిక్‌/డీజిల్‌ ఆటోలు, డోజర్‌ కొనుగోలుకు అనుమతి అంశాలూ ఎజెండాలో ఉన్నాయి. వర్షాల సమయంలో అత్యవసరంగా వాడిన పొక్లెయిన్‌లకు బిల్లుల చెల్లింపు అంశం సైతం ఎజెండాలో ఉంది. అయితే ఈ బిల్లులపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే వినాయక చవితి పండుగ, నిమజ్జనం ఏర్పాట్ల కోసం రూ.20 లక్షల వ్యయ ప్రతిపాదన చేశారు.

గతంలో జరిగిన మూడు మున్సిపల్‌ సమావేశాలు సజావుగా సాగలేదు. అభివృద్ధి అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకోకుండానే నిరసనలు, వాగ్వాదాలు, వాయిదాల నడుమ రసాభాసగా ముగిశాయి. తాజా సమావేశమైనా సజావుగా సాగి పట్టణ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని రో డ్లు గుంతలమయమయ్యాయి. డ్రెయినేజీలలో నీ రు నిలిచి, రోడ్లపై మురికి నీరు పారుతూ కంపుకొడుతున్నాయి. చిన్నపాటి వర్షానికే కాలనీలు జలమయమవుతున్నాయి. బల్దియా కార్మికులకు పంపిణీ చేసిన గ్లౌజ్‌, నూనెలు, చీపుర్లు, దుస్తుల కోనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఇలాంటి అభివృద్ధి పనులపై ఎలాంటి స్పష్టమైన ప్రణాళికలు ఎజెండాలో లేకపోవడంతో కొందరు కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement