కామారెడ్డి క్రైం: రాఖీ పండుగ వేళ పట్టణ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి చలానాలు విధించే పోలీసులు.. శుక్రవారం మాత్రం జరిమానా కంటే చైతన్యానికి, అవగాహనకు ప్రాధాన్యతనిచ్చారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిల్చొని రోడ్డుపై హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నవారిని ఆపి రాఖీ కట్టి బాధ్యతను గుర్తుచేశారు. ‘అన్నా.. హెల్మెట్ పెట్టుకో.. ఇంటి దగ్గర నీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తుంటుంది’ అంటూ సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


