20 ఏళ్లుగా ఖాళీగానే ఉంది
నోటీసులిచ్చాం
● నివాసాల మధ్య మురికికూపాలు
● ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న వర్షపు నీరు
● చెత్తాచెదారం, నీటితో దోమల వృద్ధి
బాన్సువాడ: పట్టణంలోని నివాసగృహాల మధ్య ఉన్న ఖాళీ ప్లాట్లలో చెత్తా చెదారం, పేరుకుపోయి, పొదలు, పిచ్చి మొక్కలకు తోడు వర్షపు నీరు, డ్రెయినేజీ నీరు నిలుస్తోంది. మురికికూపాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా దోమలు, పందులకు నిలయాలుగా మారుతున్నాయి. దీంతో చుట్టూ పక్కలా నివాసం ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దోమల స్వైర విహారం..
పట్టణంలో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, విలీన కాలనీలో చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు లేక స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఆయా ప్లాట్లలో నిలుస్తున్న నీటితో పిచ్చి మొక్కలు మొలచి మురికి కూపాలుగా మారాయి. సాయికృపానగర్, చైతన్య కాలనీ, వాసవీకాలనీ, ఎన్‌జీవోఎస్ కాలనీ, సంగమేశ్వర కాలనీ, టీచర్స్ కాలనీ, బీసీ కాలనీ, అర్ఫత్‌కాలనీ, పంచముఖీ హనుమాన్ కాలనీ, బాలజీనగర్ జనవాస ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు పాగింగ్ చేయడంతో పాటు డ్రెయినేజీల్లో దోమల లార్వాలు పెరగడకుండా ఆయిల్‌బాల్స్ వేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.దీనికి తోడు ఖాళీ స్థలాల్లో విషపు పురుగులు సంచరిస్తుండటంతో సమీప ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అటు స్థలాల యజమానులు, ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శాంతినగర్ కాలనీలో మా ఇంటి పక్కన ఉన్న ప్లాటు 20 ఏళ్లుగా ఖాళీగానే ఉంది. మురుగునీరు నిల్వ ఉండడంతో రాత్రి వేళ్లలో దోమలు బెడద నెలకొంది. చాలా సార్లు మున్సిపల్‌లో ఫిర్యాదు చేసినాం.
– గణేశ్, శాంతినగర్, బాన్సువాడ
పట్టణంలోని అన్ని వార్డుల్లో ఖాళీ స్థలాలను గుర్తించాం. చాలా మందికి నోటీసులు అందించాం. ప్లాట్ల యజమానులు బాధ్యతతో మెదలాలి, వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
– గోపు గంగాధర్, మున్సిపల్ కమిషనర్ బాన్సువాడ


