ఇప్పటి వరకు పంటల సాగు ఇలా..
బోరు బావులలో నీరు తగ్గింది
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో వానాకాలం సీజన్ ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా భారీ వర్షాలు ఒక్కటీ కురవకపోవడంతో వాగులే కాదు కదా కనీసం ఒర్రెలు కూడా ప్రవహించలేదు. ఈ నాటికి జిల్లాలో సాధారణ వర్షాపాతం 230.9 మి.మీ. అయితే 172.8 మి.మీ. వర్షాపాతం నమోదైంది. అది కూడా కొన్ని మండలాల్లో ఎక్కువ కురవగా, చాలా మండలాల్లో కొద్దిమేర కురిసింది. నాగిరెడ్డిపేట మండలంలో 60 శాతం లోటు వర్షాపాతం నమోదవగా, జిల్లాలో 25 మండలాలకు గాను 16 మండలాల్లో 50 నుంచి 60 శాతం వర్షం కురిసింది. మిగతా మండలాల్లో కూడా సాధారణం కన్నా తక్కువగానే వర్షాపాతం నమోదైంది. నాగిరెడ్డిపేట, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, రాజంపేట, మాచారెడ్డి, బీబీపేట, డోంగ్లీ, మహ్మద్‌నగర్, బాన్సువాడ తదితర మండలాల్లో వర్షాపాతం తక్కువగా నమోదైంది. ఒర్రెలు పారకపోవడంతో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందలేదు. పైగా భూగర్భ జలమట్టం పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వరి నాట్లు 15 శాతమే
జిల్లాలో ఈసారి వానాకాలంలో 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు నాట్లు వేసింది కేవలం 48,053 ఎకరాలే. అంటే 15 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. 1,78,781 ఎకరాల్లో వరి నాట్లు వేయడానికి నారు అందుబాటులో ఉన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు లేకపోవడం, భూగర్భజలాలు పడిపోతుండడంతో నాట్లు వేసే పరిస్థితులు కనబడటం లేదు. చాలా చోట్ల భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతుండడంతో బోర్లు ఎత్తిపోతున్నాయి. కేవలం నిజాంసాగర్ ఆయకట్టు కింద మాత్రమే నాట్లు వేశారు. మిగతా కొన్ని ప్రాంతాల్లో బోర్లపై ఆధారపడి నాట్లు వేస్తున్నారు. అయితే కౌలాస్‌నాలా, పోచారం ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజీ మూలంగా వాటి ఆయకట్టు బీడువారి ఉంది. లక్ష పైచిలుకు ఉన్న బోర్ల కింద నాట్లు వేసే పరిస్థితి అంతంత మాత్రమే. గట్టి వర్షాలు కురిస్తేనే ముందుకు వెళ్లాలని రైతులు ఆలోచిస్తున్నారు.
పంట విస్తీర్ణం (ఎకరాలు)
వరి 48,053
సోయా 66,056
మొక్కజొన్న 38,995
పత్తి 38,451
కందులు 38,414
పెసర 1,251
మినుము 1,059
చెరకు 245
సన్‌ఫ్లవర్ 35
ఇతర పంటలు 20
మొత్తం 2,32,579
పోయిన ఏడాది అతివృష్టితో జలప్రళయం చోటుచేసుకోగా, ఈ ఏడాది వరుణుడు దోబూచులాడుతుండటంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షాపాతానికి తక్కువ నమోదైంది. మరోవైపు భూగర్భ జలాలూ అడుగంటుతున్నాయి.
ఎల్లారెడ్డిరూరల్: బోరుబావులలో నీరు తగ్గడంతో వరి నాట్లు వేయడంలో బాగా ఆలస్యమవుతున్నది. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో బోరుబావులలో నీరు తగ్గింది. గతేడాది ఈపాటికి వరి నాట్లు పూర్తయ్యాయి. ఎల్‌నినో ప్రభావం బాగానే ఉంది.
– కంచం చిరంజీవి, యువరైతు, దేవునిపల్లి
వర్షాలపై ఆధారపడి జిల్లాలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయడానికి కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేశారు. అప్పుడప్పుడు కురిసిన జల్లులతో కొన్ని చోట్ల మొలకెత్తగా, వర్షాలు కురవని ప్రాంతంలో మట్టిలోనే విత్తనం చచ్చిపోయింది. జిల్లాలో 90,684 ఎకరాల్లో సోయా సాగవుతుందనుకుంటే 66,056 ఎకరాల్లో మాత్రమే వేశారు. అంటే దాదాపు 25 వేల ఎకరాలు తగ్గింది. మొక్కజొన్న 54,520 ఎకరాల్లో అవుతుందని అంచనా వేయగా 38,995 ఎకరాల్లో సాగైంది. పత్తి 42,887 ఎకరాలకు గాను 38,451 ఎకరాల్లో, కంది 45,506 ఎకరాలకు గాను 38,414 ఎకరాల్లో సాగు చేశారు. పెసర, మినుము ఆరు వేల ఎకరాల్లో సాగవుతుందనుకుంటే రెండువేల ఎకరాల్లో సాగైంది. ఇంకో వారం రోజుల వరకు వర్షాలు కురవని పక్షంలో వేసిన ఆరుతడి పంటలన్నీ దెబ్బతినే పరిస్థితి ఉంది.
జల్లులే తప్ప జడివానలు లేవు
16 మండలాల్లో దుర్భర పరిస్థితులు
వానాకాలం సాగు లక్ష్యం
5.59 లక్షల ఎకరాలు
ఇప్పటికీ సాగైంది 2.32 లక్షలు
వానల్లేక ఆరుతడి పంటల పరిస్థితి
అయోమయం


