● అదనపు కలెక్టర్ ఎన్.వై గిరి
కామారెడ్డి టౌన్ : ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ పత్రాల సేకరణను వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కాకతీయనగర్ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, మిగిలిన ఫారాలను సిబ్బంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి సేకరిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ హిమబిందు, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ హన్మంత్ రావ్, కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత, బీఎల్‌వోలు ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. కార్యక్రమానికి కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.జైపాల్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా మూడ పవన్, ఉపాధ్యక్షుడిగా గుడుగుల అరవింద్, ప్రధాన కార్యదర్శిగా ఆశమాల సూర్యప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా అర్జున్ ఆర్య, కోశాధికారిగా ఆశమాల చంద్రప్రసాద్, కార్యవర్గసభ్యులుగా కే.ఉదయ్‌కుమార్, డి.సాయిశ్రీనివాస్, డి.సాత్విక్, జి.సుమాంజలి, రమేశ్, ముఖ్య సలహాదారుగా షేక్ మొహినుద్దీన్ ఎన్నికయ్యారు.
● యాదగిరి కుటుంబానికి చేయూత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడటంతో వెన్నెముక దెబ్బతిని జీవచ్ఛవంలా మారిన నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటకు చెందిన బోయిని యాదగిరి కుటుంబానికి చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకొస్తున్నారు. యాదగిరి దీనస్థితిపై ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆమే వెన్నెముక!’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. అతని బ్యాంకు ఖాతాకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆదివారం ఒక్కరోజే రూ.30 వేలు ఆర్థిక సాయాన్ని జమ చేశారు. కాగా, యాదగిరి బ్యాంకు ఖాతా ఒక్కరోజులో జరగాల్సిన లావాదేవీల కన్నా ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం నుంచి అతని ఖాతాలో డబ్బులు జమకాలేదు. సోమవారం మరికొంత మంది అతనికి ఆర్థికసహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దాతలెవరైనా యాదగిరికి ఆర్థిక సహాయం అందించాలనుకుంటే ఫోన్ నంబర్‌తోపాటు బ్యాంకు ఖాతా నంబర్‌కు నేరుగా డబ్బులు పంపొచ్చు.
యాదగిరి బ్యాంకు ఖాతా వివరాలు
ఖాతాదారుని పేరు : బోయిని యాదగిరి
అకౌంట్ నం: 62208685421
ఐఎఫ్‌ఎస్‌సీ : SBIN0021758
బ్రాంచ్ : నాగిరెడ్డిపేట


