పాఠశాల అభివృద్ధికి నావంతు కృషి
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ప్రధానోపాధ్యాయుడి తపనకు స్నేహబంధం తోడయ్యింది. స్నేహితుడి పిలుపు.. విద్యపై ఉన్న మమకారంతో పాఠశాల అభివృద్ధికి చేయూతనందించారు ఓ ప్రవాస భారతీయుడు. బిచ్కుంద మండలం పుల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం జీ.ఆనంద్‌కుమార్, అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ విల్కో సోర్స్ సీటీవో కే.సురేశ్‌రెడ్డి చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరిదీ వరంగల్ జిల్లా. 2023లో హెచ్‌ఎంగా బదిలీపై వచ్చిన ఆనంద్‌కుమార్ తాను పనిచేసే పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సురేశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాఠశాలను సందర్శించిన సురేశ్ రెడ్డి రూ.21 లక్షల భారీ విరాళం అందజేశారు. ఆ విరాళంతో పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
కార్పొరేట్ హంగులు..
కార్పొరేట్ తరహాలో తరగతి గదులలో ఆకర్షణీయమై న టైల్స్ అమర్చి సరికొత్త బెంచీలను ఏర్పాటు చేశా రు. డిజిటల్ టచ్ స్క్రీన్ స్మార్ట్ బోర్డులను బిగించారు. విద్యార్థినుల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన 10 మరుగుదొడ్లు నిర్మించారు. పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల కోసం విశాలమైన స్టేజ్, హ్యాండ్‌వాష్ ఏరియా నిర్మించారు. గతేడాది హెచ్‌ఎం ఆనంద్‌కుమార్ సొంత డబ్బులు రూ.1.50 లక్షలు, మరో స్నేహితుడు కరుణాకర్‌రెడ్డి రూ.1.50 లక్షలతో ఐదు మరుగుదొడ్లు నిర్మించి నీటి వసతి కల్పించారు. పనులు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 13న ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దాత విల్‌కో సోర్స్ సీటీవో సురేశ్‌రెడ్డి, సంస్థ ప్రతినిధులు కేదార్ రేలంగి, సందీప్‌రెడ్డి, సునీల్ కుమార్, సత్య కుందుర్తి, సర్పంచ్ సంతోష్ పటేల్ హాజరుకానున్నారు.
నేను విధులు నిర్వహించే ప్రతిచోట పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాను. సురేశ్ రెడ్డి, నేను వరంగల్‌లో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం. పాఠశాల సమస్య వివరించిన వెంటనే స్పందించి రూ.21 లక్షలు విరాళం ఇచ్చారు. పనులు పూర్తయ్యాయి. గతేడాది ఏడాది మరో స్నేహితుడు కరుణాకర్‌రెడ్డి రూ.1.50 లక్షలు, నా సొంత డబ్బులు రూ.1.50 లక్షలతో మిగతా పనులు చేశాం. – జీ.ఆనంద్‌కుమార్, హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, పుల్కల్
హెచ్‌ఎం పిలుపుతో కదిలివచ్చిన
స్నేహితుడు, ఎన్నారై సురేశ్ రెడ్డి
పుల్కల్ ఉన్నత పాఠశాలకు
రూ. 21 లక్షలు విరాళం
మారిన పాఠశాల రూపురేఖలు
నేడు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం


