ఫీల్డులో సగమే.. | - | Sakshi
Sakshi News home page

ఫీల్డులో సగమే..

Jul 13 2026 1:16 AM | Updated on Jul 13 2026 1:16 AM

ఫీల్డులో సగమే..

536 జీపీలకు 262 మంది క్షేత్ర సహాయకులు

కార్యదర్శులు పర్యవేక్షించాలి

ఉపాధి హామీలో వేధిస్తున్న

క్షేత్రసహాయకుల ఖాళీలు

గాడి తప్పుతున్న పర్యవేక్షణ

మేట్‌లదే ఇష్టారాజ్యం!

బాన్సువాడ రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీ య ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం పర్యవేక్షణకు గ్రామానికో క్షేత్రసహాయకుడు(ఫీల్డ్‌ అసిస్టెంట్‌)ను నియమించారు. వీరు కూలీల హాజరు నమోదు, పనుల గుర్తింపు, పని ప్రదేశంలో వసతుల కల్పన, జాబ్‌ కార్డుల మంజూరు, వన మహోత్సవం, నర్సరీల నిర్వహణ తదితర పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, కొత్తగా ఏర్పడిన జీపీలతోపాటు వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన పాత గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేక పథకం నిర్వహణ భారంగా మారింది.

పారదర్శకత కరువు..

జిల్లాలో సరిపడా క్షేత్ర సహాయకులు లేకపోవడంతో ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు గ్రామాలకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. దీంతో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌చార్జీలుగా ఉండటంతో కూలీల సంఖ్యను పెంచలేకపోతున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన ఎన్‌ఎంఎంఎస్‌ అనే హాజరు యాప్‌తో క్షేత్రసహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. పని ప్రదేశంలో సర్వర్‌ రాకపోవడంతోపాటు సిగ్నల్‌ సరిగ్గా అందక హాజరు ఆలస్యం అవుతోందని కూలీలు వాపోతున్నారు. ప్రతి 40 మంది కూలీలకు ఒకరి చొప్పున ఏర్పాటు చేసిన మేట్‌లు ఉన్నా పంచాయతీ కార్యదర్శులు, ఇన్‌చార్జి క్షేత్రసహాయకుడే పనుల బాధ్యత చూడాల్సి వస్తోంది. మేట్‌లు ఏ తప్పిదం చేసినా క్షేత్రసహాయకులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యులు కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మేట్‌లకు పూర్తి స్థాయి బాధ్యతలు లేకపోవడంతో పనుల్లో పురోగతి లేకుండా పోతోందని కూలీలు వాపోతున్నారు. గ్రామాలకు కొత్త పనులను కేటాయించడం, ఉపాధి గ్రామ సభలు, నర్సరీల నిర్వహణ, కూలీలకు వేతనాల మంజూరు వంటి విషయాల్లో పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో సమయానికి కూలి అందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

కామారెడ్డి జిల్లాలో 536 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 262 మంది క్షేత్ర సహాయకులు పనిచేస్తున్నారు. 2018 నుంచి విడతల వారీగా జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. కానీ క్షేత్రసహాయకుల నియామకాలు జరగడం లేదు. దీంతో పక్క గ్రామాల వారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. లేదంటే అనుభవం ఉన్న సీనియర్‌ కూలీని మేట్‌గా గుర్తించి పనులు చేయిస్తున్నారు. అయితే, ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేని గ్రామాల్లో మేట్‌ల ఇష్టారాజ్యం కొనసాగుతోందనే విమర్శలున్నాయి.

జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేయలేదు. ప్రభుత్వ పాలసీ ప్ర కారం భర్తీకి నిర్ణయం తీసుకుంటే నియామకాలు జరుగుతాయి. అప్పటి వరకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లేని గ్రామ పంచాయతీల్లో జీపీ కార్యదర్శులు ఉపాధిహామీ పను లు పర్యవేక్షించాలి. ఇప్పటికే ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల తోపాటు పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసుకుని ఇబ్బందులు రాకుండా పర్యవేక్షిస్తున్నాం.

– మధుసూదన్‌రెడ్డి, డీఆర్‌డీవో, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement