ఫోర్ వీలర్స్‌తోపాటు టూ వీలర్స్ కూడా..
● చలానాలు తప్పించుకునేందుకు ఎత్తులు
● వాహనాల నంబర్లు మార్చి
తిప్పుతున్న వైనం
● తనిఖీల్లో చిక్కుతున్న వాహనదారులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానా విధిస్తోంది. అయితే చలానాలకు విరుగుడుగా కొందరు వాహనదారులు నంబర్ ప్లేట్‌ను మార్చేసి ఏమారుస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులు ఏదో ఒక నంబరు రాయించుకుని తిరుగుతున్నారు. వాహనాల తనిఖీల సమయంలో పోలీసులు వాహనంపై ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే అసలు విషయం బయటపడుతోంది. భిక్కనూరులో పోలీసులు జాతీయ రహదారిపై ఇటీవల వాహనాలను తనిఖీ చేసే సమయంలో తప్పుడు నంబరు ప్లేట్‌తో తిరుగుతున్న డీసీఎం వ్యాన్ పట్టుబడింది. అసలు నంబర్‌కు బదులు డీసీఎంకు మరో నంబర్ వేసి నడుపుతూ పోలీసులకు చిక్కారు. దీంతో డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లాలో గత కొంత కాలంగా వేరే నంబర్లు వేసుకుని తిరుగుతున్న వాహనాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కొందరు తమ రిజిస్ట్రేషన్ నంబరును నంబర్ ప్లేట్‌పై మార్చేసి నడుపుతుంటారు. అయితే ట్రాఫిక్ ఉల్లంఘన సమయంలో చలానా ఆ నంబరు ఉన్న ఇతర వాహనదారుడికి వెళ్తుంది. ఆ బైకు తనది కాదని, తాను చలానా పడిన ఆ ప్రాంతానికే వెళ్లలేదంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చాలా చోట్ల పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ ధరించలేదని, బైకుపై ముగ్గురు ప్రయాణించడం వంటి కారణాలతో జరిమానాలు ఎక్కువగా పడుతుంటాయి. అయితే నంబరు వేరేది వేసుకుని తిరిగేవారు దర్జాగా ఉండగా, ఆ నంబరు ఉన్న ఇతర వాహనాల యజమానులకు ఫైన్‌లు పడుతుండడంతో లబోదిబోమంటున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు విధిస్తున్న చలానాలను తప్పించుకునేందుకే చాలా మంది నంబర్ ప్లేట్లు మారుస్తున్నట్టు తెలుస్తోంది. పరిమిత వేగాన్ని దాటి ప్రయాణించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణించడం, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను నిలపడం, రోడ్డు మీద వాహనాలను నిలపడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి వాటిని పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయా నిబంధనలకు ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వాహనాల తనిఖీ సమయంలోనైతే బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగి నడిపేవారిని పట్టుకుని చట్టం ముందు నిలబెడుతున్నారు. కోర్టుల్లో జరిమానాలతోపాటు శిక్షలు కూడా పడుతున్నాయి. అయితే జరిమానాలను తప్పించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనాల తనిఖీ సందర్భంలో పోలీసులు మోటార్ చట్టానికి సంబందించి పలు పోర్టల్స్‌లో వాహనాల నంబర్లు నమోదు చేసి వివరాలను పరిశీలిస్తున్నారు. ఒక వేళ వాహనంపై ఉన్న నంబరు సరైనదైతే వదిలేస్తున్నారు. ఏమైనా తేడా ఉంటే పట్టేస్తున్నారు.
జిల్లాలో అనేక రకాల వాహనాలకు డూప్లికేట్ నంబర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పోలీసు లు నంబర్ ప్లేట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. నంబరు కనబడకుండా ఎలాంటి ఉపాయం చే సినా పట్టేస్తున్నారు. వాహనం అసలు నంబరు కు బదులు ఇతర నంబర్లు ఉంటే జరిమానా విధించడంతోపాటు వారిపై కేసులు కూడా న మోదు చేస్తున్నారు. నంబరు ప్లేట్లను మార్చడం చట్ట విరుద్ధమని పోలీసులు అంటున్నారు. ఏదై నా ప్రమాదం జరిగినప్పుడు నంబరు ప్లేట్ త ప్పుగా ఉంటే అటు బాధితునికి, ఇటు నిందితు నికి ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు.


