రామారెడ్డి: ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కలెక్టరేట్‌లను ముట్టడిస్తామని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం రామారెడ్డిలో మండల స్థాయి దివ్యాంగుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సుజాత మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలకు, వృద్ధాప్య, వితంతు పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనర్హులకు సదరం సర్టిఫికెట్ ఇస్తున్న అధికారులు, అర్హులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్, ఉపాధ్యక్షులు హుస్సేన్, రాజనర్స్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజాత, ప్రతినిధులు నరేందర్, శివరాజ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 8,124 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 285 మంది గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. పరీక్షలను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం పర్యవేక్షించారు.
బీబీపేట: కోనాపూర్ సర్పంచ్ చెప్యాల రాజేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొసైటీ గోదాం నిర్మాణం కోసం గురువారం మూడు గుంటల భూమిని విరాళంగా ఇచ్చా రు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ గ్రామంలో సొసైటీ గోదాం లేకపోవడంతో ఎరువులు, విత్తనాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గోదాం నిర్మాణం, వడ్లను ఆరబోసుకునేందుకు వీలుగా రోడ్డుకు పక్కనే ఉన్న మూడు గుంటల భూమిని ఇచ్చానన్నారు. ప్రభుత్వం నిధులు అందిస్తే గోదాం నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.
కామారెడ్డి అర్బన్: హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలకు ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు ఎక్కువ మంది నమోదు చేసుకుని ఎంపికల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, జెడ్పీ సీఈవో చందర్, డీఈవో రాజు, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్, ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రంలోని మామిడి చెట్లకు కాసిన కాతను వారం రోజుల్లో వేలం వేస్తామని జిల్లా ఉద్యానశాఖ అధికారి జ్యోతి తెలిపారు. గురువారం ఆమె ఉద్యాన క్షేత్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పండ్లతోటల మధ్య పెరిగిన పొదలు, పిచ్చిమొక్కలను తొలగించడానికి రూ. 69 వేలు వెచ్చించామన్నారు. జిల్లాలో ఈయేడు 2,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,500 ఎకరాలలో సాగుకు మంజూరు వచ్చిందన్నారు. ఇందులో 928 ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటారన్నారు. రైతులకు 90 శాతం సబ్సిడీపై వెజిటెబుల్ మినీ కిట్లను అందజేస్తామన్నారు. ఆమెవెంట మాల్తుమ్మెద ఉద్యానక్షేత్ర ఇన్‌చార్జి హెచ్‌వో సంతోషి, సిబ్బంది నవీన్ ఉన్నారు.


