సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం జిల్లాలోని కమ్మర్‌పల్లి అటవీ క్షేత్రం పరిధిలోకి వచ్చిన ఈ పెద్ద పులి అదే రేంజ్‌లో తిరుగుతున్నట్లు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కోనాపూర్ సెక్షన్‌లోని ఇనాయత్‌నగర్ బీట్ పరిధిలో ఉన్న గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు సమీపంలో జలాశయం ప్రాంతంలో ఈ పులి తిష్ట వేసుకుని ఉంది. గురువారం తెల్లవారుజామున అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో కచ్చితమైన నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలోని తాడోబా అడవి నుంచి వచ్చిన ఈ పులి కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో సంచరిస్తూ వచ్చింది. యాదాద్రి జిల్లా అటవీ ప్రాంతం వరకు వెళ్లి మళ్లీ తిరుగు ప్రయాణంలో ఉన్న ఈ పులి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లాలోకి వచ్చింది. ప్రస్తుతం కమ్మర్‌పల్లి అటవీ రేంజ్ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో 18 మంది మూడు బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
టైగర్ రిలాక్స్!
నెలల తరబడి వివిధ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చిన ఈ మగ పెద్ద పులి ఆడ పులి తోడు కోసం తిరుగుతోంది. కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో తిష్ట వేసుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నెలలపాటు తిరిగిన పులి ఇక్కడ రిలాక్స్ అవుతున్నట్లు అంచనా. మూడు రోజుల క్రితం ఇక్కడకు వచ్చిన ఈ పులి ఇదే చోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
● వన్యప్రాణుల దాహార్తి తీర్చడంలో భాగంగా ఉమ్మడి ఏపీలో జలయజ్ఞం కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు గట్టుపొడిచినవాగు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు జలాశయంలోని నీరు సాగునీటికి సైతం ఉపయోగపడుతోంది.
● జిల్లాలోకి ఈ నెల 3న ప్రవేశించిన పెద్ద పులి పాద ముద్రలను గట్టుపొడిచినవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. ఈ పులి పాద ముద్రలు 19 సెంటీమీటర్ల మేర ఉండడంతో మగపులిగా అధికారులు నిర్ధారించారు. ఇదే ప్రాంతంలో పలుచోట్ల పులి పాద ముద్రలు కనిపించడం గమనార్హం. అటవీ అధికారులు, సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు. సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పెద్ద పులి కచ్చితంగా గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రాంతంలోనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఆహారం కోసం వన్యప్రాణుల లభ్యత, వేసవి కావడంతో దాహార్తిని తీర్చుకునేందుకు పుష్కలంగా నీటి సౌకర్యం ఉండడంతో పులి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు.
గట్టుపొడిచిన వాగు వద్ద తిష్ట
జంతువులను వేటాడి చంపి తిని విశ్రాంతి
డ్రోన్ కెమెరాలతో పులి కదలికలను
గుర్తించేందుకు అటవీశాఖ ప్రయత్నాలు
పులిని చూసి కళ్లు తిరిగి
మూర్చపోయిన బీట్ అధికారి శ్రీదేవి


