ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం..

Feb 7 2026 10:12 AM | Updated on Feb 7 2026 10:12 AM

ఔటర్‌

ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం..

కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపిస్తే అభివృద్ధి..

సభలో పాల్గొన్న ప్రజలు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండడం సాధ్యం కాదు. బీజేపీకి ఓట్లు వేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే ఎలా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని కేశాపూర్‌ వద్ద ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పాలనలో నిజామాబాద్‌ నగరం చెత్తకుప్పలా మారిందన్నారు. 12 ఏళ్లుగా మోదీ, 10 ఏళ్ల పాటు కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 90 శాతం ఉన్నప్పటికీ అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. నిజామాబాద్‌ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్‌ స్మార్ట్‌ సిటీ పథకం ఎందుకు తేలేదన్నారు. ఎంపీ కేవలం మోదీ జపం చేస్తున్నారన్నారు. నిజామాబాద్‌ గల్లీల్లో మోరీలు తీయాలంటే మోదీ అవసరమా అన్నారు. నిజామాబాద్‌ జిల్లాకు విమానాశ్రయం ఎందుకు సాధించలేదన్నారు. ఎందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కేంద్రం నుంచి నిజామాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుకు నిధులు ఇస్తే మేం వద్దన్నామా అన్నారు. ఏమి నిధులు తెచ్చారని ఓట్లు అడుగుతున్నారన్నారు. మూడు సార్లు మోదీ ప్రధాని అయినప్పటికీ నిజామాబాద్‌ ను స్మార్ట్‌ సిటీ చేయలేకపోయారన్నారు.

● నిజామాబాద్‌ రైతులు ఆత్మగౌరవంతో పంటలు పండించుకుంటున్నారంటే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వల్లేనన్నారు. నిజామాబాద్‌ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి నినదించింది ఈ గడ్డమీద నుంచేనన్నారు. సుదర్శన్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు మంత్రులుగా పని చేశారని, చిన్న మచ్చ లేదన్నారు. ఇక నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయానికి మారు పేరన్నారు. క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం వస్తుందన్న నానుడి ఉండేదన్నారు. ఇక్కడి వ్యవసాయం తెలంగాణతో పాటు దేశానికే ఆదర్శమన్నారు. నిజామాబాద్‌ రైతుల పోరాటాలు దేశానికే ఆదర్శమన్నారు.

● జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. నా మనసులో నిజామాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాకు అవసరమైన నిధులు మంజూరు చేస్తా. జిల్లాలో వివిధ విద్యాసంస్థల కోసం రూ.600 కోట్లు మంజూరు చేశాం. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీల్లో రూ.1,045 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నిధులు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే కానీ మున్సిపల్‌ శాఖ మంత్రినైన నావద్దకు రావాలి. నిధులు ఇచ్చే బాధ్యత నాదే. జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాదేనన్నారు.

నిజామాబాద్‌ నగరపాలకం, ఉమ్మడి జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించుకోవాలని, అప్పుడే అభివృద్ధి పనులు జరుగుతాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని ఉమ్మడి నిజామాబాద్‌ ప్రజలు వదులుకోవద్దన్నారు. నిజామాబాద్‌ నగరంలో బీజేపీ ఓట్లు అడగాలంటే స్మార్ట్‌ సిటీగా ప్రకటించాలన్నారు. ఓట్లు అడిగే హక్కు లేని బీజేపీని బొందపెట్టాలన్నారు. నిజామాబాద్‌కు ఎయిర్‌పోర్టు తీసుకొచ్చే బాధ్యత మాదేనన్నారు. ఇప్పటికే వరంగల్‌, ఆదిలాబాద్‌లకు ఎయిర్‌పోర్టులు తీసుకొచ్చామన్నారు. నిజామాబాద్‌కు ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తామన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పాలనలో

నిజామాబాద్‌ చెత్తకుప్పలా మారింది

ఎంపీ అర్వింద్‌ స్మార్ట్‌ సిటీ స్కీం

ఎందుకు తేలేదు.. విమానాశ్రయం

ఎందుకు తీసుకురాలేదు

గతంలో 90 శాతం ఉన్న

బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు

అభివృద్ధిని అడ్డుకున్నారు..

గాడిదకు గడ్డి వేసి ఆవుకు

పాలు పిండడం సాధ్యం కాదు

నేనే మున్సిపల్‌ మంత్రిని..

కాంగ్రెస్‌ను గెలిపిస్తే నిధులిస్తా

నగరపాలకం, పురపాలకాల్లో

కాంగ్రెస్‌ను గెలిపిద్దాం

కేశాపూర్‌ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం..1
1/1

ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement