నేలకొరిగిన విప్లవ శిఖరం!
అంతటా స్వామి గురించే చర్చ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్ నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. కొద్దికాలానికే పూర్తి స్థాయి కార్యకర్తగా మారాడు. పార్టీలో స్వామి పేరుతో పనిచేశాడు. ఉద్యమంలో చేరిననాటినుంచి వెనుదిరిగి చూడలేదు.
కుటుంబమంతా ఉద్యమ బాటలో..
స్వామి కామారెడ్డి ఏరియాతో పాటు సిర్నాపల్లి, ఎల్లారెడ్డి ఏరియాల్లో దళ కమాండర్‌గా పనిచేశాడు. జిల్లా కమిటీ సభ్యుడి హోదాలో చాలా కాలం పనిచేసిన స్వామి కార్యదర్శిగా ఎదిగారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించడంతో లొంగుబాట్లు, అరెస్టులతో పాటు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఎంతో మంది సానుభూతిపరులు, నక్సలైట్లు చనిపోయారు. దీంతో అప్పటి పీపుల్స్‌వార్ నేతలు స్వామిని దండకారణ్యానికి పంపించారు. కొద్ది కాలానికే స్వామి భార్య సులోచన కూడా అడవి బాట పట్టింది. నవత పేరుతో దండకారణ్యంలో పనిచేసింది. వారి పిల్లలు రమేశ్, లావణ్యలు బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు. అయితే 2005 లో లావణ్య, రమేశ్‌లు కూడా అడవిబాట పట్టారు. ఎనిమిదేళ్ల క్రితం స్వామి భార్య సులోచన అనారోగ్యంతో అక్కడే చనిపోగా విప్లవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి కూతురు లావణ్య ఆరు నెలల క్రితం చత్తీస్‌గఢ్‌లో అరైస్టె జైలులో ఉండగా.. కుమారుడు రమేశ్ డిసెంబర్ 2న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్వామి ప్రస్తుతం ప్రభాకర్ పేరుతో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా అలాగే వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది.
ప్రభాకర్ పేరుతో పనిచేస్తున్న స్వామి అలియాస్ లోకేటి చందర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వార్త శుక్రవారం రాత్రి ప్రసార ధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైంది. ఉమ్మడి జిల్లా విప్లవోద్యమం గురించి అవగాహన ఉన్నవారు చాలా మంది ఆయన గురించి చర్చించుకోసాగారు. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఆపరేషన్ కగార్‌తో ఏర్పడిన తీవ్ర నిర్బంధంతో లొంగిపోతాడని అందరూ భావించారు. ఆయన వెనకడుగు వేయకుండా చివరి వరకు విప్లవోద్యమానికి అంకితమయ్యాడని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లా విప్లవోద్యమ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విప్లవ శిఖరం నేలకొరిగింది. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండి పీడిత ప్రజల కోసం నడిచిన స్వామి అలియాస్ లోకేటి చందర్ శకం శుక్రవారంతో ముగిసింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో స్వామి మరణించాడు.
మూడున్నర దశాబ్దాల పాటు
అజ్ఞాతంలో స్వామి
విప్లవోద్యమంలోనే కన్నుమూసిన భార్య
ఇటీవల లొంగిపోయిన కుమారుడు..
ఆరునెలలుగా జైలులోనే కూతురు


