అప్పుడు మెట్టినిల్లు.. ఇప్పుడు పుట్టినిల్లు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆరేళ్ల నాడు అత్తగారి ఊరు నుంచి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించిన ఆమె.. ఈసారి తల్లిగారి ఊరు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన ఉర్దొండ వనిత 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 10 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2024 లో అప్పటి చైర్మన్ జాహ్నవిపై అవిశ్వాసం పెట్టడంతో ఆమె పదవి కోల్పోయింది. ఆ సమయంలో చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన వనిత.. వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకున్నారు. దాదాపు ఏడాది పాటు ఆమె వైస్ చైర్మన్‌గా కొనసాగారు. ఈసారి కాంగ్రె్‌స్ పార్టీ అభ్యర్థిగా తన తల్లిగారు ఊరు లింగాపూర్ గ్రామ పరిధిలోని 9 వ వార్డు నుంచి బరిలో దిగారు. ఈసారి గెలిస్తే చైర్మన్ పదవి రేసులో నిలిచే అవకాశాలున్నాయి. కాగా వనిత తండ్రి కొమిరెడ్డి నారాయణ అప్పట్లో లింగాపూర్ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అలాగే ఆమె మామ (భర్త తండ్రి) ఉర్దొండ రాజయ్య దేవునిపల్లి గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పనిచేశారు.


