నాలుగుసార్లు.. నాలుగు వార్డులు..
సాధారణంగా నేతలు ఒక స్థానానికి పరిమితమవుతారు. గెలిచినా ఓడినా తర్వాతి ఎన్నికల్లో అదే స్థానంనుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఆ నేత తీరే వేరు.. ప్రతిసారి కొత్త వార్డు నుంచి బరిలో దిగుతారు. ఆయనే కామారెడ్డికి చెందిన మాజీ కౌన్సిలర్ నిట్టు కృష్ణమోహన్‌రావు. ఆయన మొదటిసారి 2005లో నిర్వహించిన ఎన్నికలలో 32వ వార్డు(అశోక్‌నగర్) నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై గెలిచి తొలిసారి కౌన్సిల్‌లో అడుగుపెట్టారు.
● 2014లో నిర్వహించిన ఎన్నికలలో రెండోసారి 28వ వార్డు (ఎన్జీవోస్ కాలనీ) నుంచి బరిలో దిగి ఓడిపోయారు. అయితే ఆయన మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా నియమితులయ్యారు.
● 2020లో మూడో పర్యాయం 8వ వార్డు (హౌసింగ్ బోర్డు కాలనీ) నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి 37 వ వార్డు(విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీలు) నుంచి బరిలో ఉన్నారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండడం గమనార్హం.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


