పంచాయతీకి ముందడుగు! | - | Sakshi
Sakshi News home page

పంచాయతీకి ముందడుగు!

Nov 23 2025 6:01 AM | Updated on Nov 23 2025 6:01 AM

పంచాయతీకి ముందడుగు!

పంచాయతీకి ముందడుగు!

532 పంచాయతీలు.. అదృష్టం కలిసొచ్చేనా?

పాత రిజర్వేషన్లను అనుసరించి..

నేడు రిజర్వేషన్లు ఖరారు

చేయనున్న అధికారులు

ఆశావహుల్లో ఉత్కంఠ

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం రెండు నెలల క్రితం కసరత్తు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పాటు నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. అయితే రిజర్వేషన్లు 50 శాతం మించడంపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. దీంతో కోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు జరపొచ్చని కోర్టు చెప్పడంతో ప్రభుత్వం పాత లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయ్యింది. జీవో 46 ప్రకారం సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా అధికారులు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేయడానికి చర్యలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పాటు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వెనువెంటనే ఖరారు చేయనున్నారు. సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్‌ను ఆర్డీవోల ఆధ్వర్యంలో, వార్డు స్థానాలకు ఎంపీడీవోల ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఖరారు చేసి కలెక్టర్‌కు నివేదిస్తారు. అనంతరం ఎన్నికల అధికారుల అనుమతితో వాటిని వెల్లడిస్తారు. ఆది, సోమవారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.

జిల్లాలో 532 గ్రామ పంచాయతీల పరిధిలో 4,656 వార్డులున్నాయి. నూరు శాతం ఎస్టీలు నివసించే పంచాయతీల్లో సర్పంచ్‌తోపాటు వార్డు స్థానాలన్నీ వారికే రిజర్వ్‌ చేస్తారు. తర్వాత ఎస్టీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్ల లెక్క తేలుస్తారు. అలాగే మహిళలకు అన్ని సామాజిక వర్గాల్లో సగం సీట్లు లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 6,39,730 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 3,07,508 మంది పురుషులు, 3,32,209 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలో 4,670 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు 5,605 మంది పోలింగ్‌ అధికారులు, 6,712 మంది పోలింగ్‌ సిబ్బంది అవసరమవుతారని అధికారులు అంచనా వేశారు.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్‌ ఎలా వస్తుందోనన్న టెన్షన్‌తో ఉన్నారు. రెండు నెలల క్రితం రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారై, పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా విడుదలయ్యింది. రిజర్వేషన్‌ అనుకూలంగా వచ్చినవారు ఎన్నికలలో పోటీ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించడంతో కోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ రిజర్వేషన్‌ ఉంటుందో, మారుతుందో అన్న టెన్షన్‌లో చాలామంది ఉన్నారు. అప్పట్లో రిజర్వేషన్‌ అనుకూలించనివారు మాత్రం కాస్త ఆనందంతో ఉన్నారు. ఈసారి అదృష్టం కలిసి వస్తుందేమోనన్న ఆశతో ఉన్నారు.

అందరూ గిరిజనులే ఉన్న పంచాయతీలు కచ్చితంగా వారికే రిజర్వు అవుతాయి. అలాగే రిజర్వేషన్లకు అనుగుణంగా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలకు సీట్లు కేటాయిస్తారు. 2019 లో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్‌ ఉండాలనే ఆదేశాలున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని సవరించింది. ఆ రిజర్వేషన్లను రొటేషన్‌ పద్ధతిలో మార్చాలని నిర్ణయించింది.

వాయిదాలు పడుతూ వస్తున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అధికార యంత్రాంగం రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement