దొడ్డు వడ్లకు తిప్పలు
● అన్‌లోడ్ చేసుకోవడానికి నిరాకరిస్తున్న
రైస్‌మిల్లర్లు
● కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు
● ఆందోళనలో రైతులు
నిజాంసాగర్(జుక్కల్) : ఖరీఫ్‌లో దొడ్డు రకం వడ్లు పండించిన రైతులు వాటిని విక్రయించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దొడ్డు వడ్లు అన్‌లోడింగ్ చేసుకునేందుకు రైస్‌మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో తూకం వేసిన దొడ్డు రకం వడ్లు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి.
10 శాతమే దొడ్డు రకం సాగు..
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించారు. అందులో 90 శాతం మేర సన్నరకం కాగా, 10 శాతం మాత్రం దొడ్డు రకం సాగు చేశారు. అయితే దొడ్డురకంతోపాటు సన్న రకం వడ్లకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, మిల్లర్లు సన్నరకం ధాన్యాన్ని స్వీకరిస్తుండగా, దొడ్డు రకం వడ్లను తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 35 లారీల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. అందులో 5 లారీలు మాత్రం సన్నరకం ధాన్యం కాగా, మిగితావి దొడ్డు రకం ధాన్యమే. మొన్నటి వరకు దొడ్డు రకం ధాన్యాన్ని తీసుకున్న రైస్‌మిల్లరు, గత నాలుగు రోజుల నుంచి నిరాకరిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రంలో 2,500 బస్తాలకు పైగా దొడ్డు రకం వడ్లు నిల్వగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తూకం చేపట్టినా బస్తాల తరలింపు కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి దొడ్డు రకం ధాన్యం బస్తాలను రైస్‌మిల్లర్లు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


