దండకారణ్యంలో స్వామి!
ఎస్‌జడ్‌సీ మెంబర్ హోదాలో... ● పది మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఒకరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సీపీఐ మావోయిస్టు పార్టీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కీలక నేతగా ఎదిగిన లోకోటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ దండకారణ్యంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఆయన స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా అలాగే వెస్ట్ జోనల్ బ్యూరోలో పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో పలువురు అజ్ఞాత నక్సల్స్ లొంగుబాటు సందర్భంగా డీజీపీ ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రం నుంచి కేంద్ర కమిటీలో ఐదుగురు, రాష్ట్ర కమిటీ సభ్యులుగా పది మంది ఉన్నారన్నారు. అందులో లోకోటి చందర్ ఒకరు.
కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకోటి చందర్ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలో కి వెళ్లారు. ఉమ్మడి జిల్లాలో దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత పార్టీ ఆయనను దండకారణ్యానికి పంపించింది. రెండు దశాబ్దాల కాలంగా అక్కడే పనిచేస్తున్నారు. స్వామి భార్య సులో చన కూడా భర్తతో కలిసి అడవిబాట పట్టింది. తరువాత 2009 లో కొడుకు రమేశ్, కూతురు లావణ్య కూడా తల్లిదండ్రుల బాటలోనే నడిచారు. ఎనిమిదేళ్ల క్రితం స్వామి భార్య సులోచన అనారోగ్యంతో దండకారణ్యంలోనే చనిపోయింది. స్వా మి అడవి బాట పట్టి న తర్వాత తిరిగి ఇంటిముఖం చూడలే దు. తండ్రి చనిపోయి నా, తల్లి చనిపోయి నా రాలేదు. ఆపరేష న్ ఖగార్‌తో నక్సల్స్ అణచివేత చర్యలు పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఇటీవల పలు ఎన్‌కౌంటర్లు జరిగాయి. అలాగే వందలాది మంది లొంగిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా కు చెందిన స్వామి దారి ఎటు అన్నదానిపై చర్చ నడుస్తోంది. తాజాగా శనివారం నక్సల్స్ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల్లో పనిచేస్తున్న ముఖ్య నేతల పేర్లను రాష్ట్ర డీజీపీ ప్రస్తావించా రు. అందులో రాష్ట్ర కమిటీ సభ్యుడి హోదాలో లోకోటి చందర్ పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. అజ్ఞాత నక్సల్స్ లొంగిపోతే ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం లొంగుబాట్లపై ఫోకస్ చేసిన నేపథ్యంలో స్వామితో పాటు మిగతా అజ్ఞాత నక్సల్స్ గురించి చర్చ నడుస్తోంది.


