అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కామారెడ్డి టౌన్/ కామారెడ్డి రూరల్/భిక్కనూరు: అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క (అనసూయ) అన్నారు. భిక్కనూరు మండల కేంద్రంతోపాటు జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్‌షెట్కార్ తో కలిసి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ముందుగా భిక్కనూరుకు చేరుకున్న మంత్రి.. రూ.92.80 లక్షలతో చేపట్టనున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రూ.9 కోట్లతో చేపట్టనున్న ఇన్‌డోర్ స్టేడియం అభివృద్ధి పనులకు, మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో రూ.9 కోట్లతో చేపట్టబోయే సీసీ రోడ్లు, మురికాలువ పనులు, ఇల్చిపూర్ వద్ద రూ.9 కోట్లతో ఓల్డెజ్ హోమ్ భవనం, గాంధీ గంజ్ ఏఎంసీలో రూ.51 లక్షలతో చేపట్టనున్న మరుగుదొడ్లు, ప్రహారీ, ర్యాంప్‌లు, కల్వర్టుల నిర్మాణ పనుల మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం మొదటిసారి ఉచిత కరెంట్ ప్రవేశపెట్టిన వ్యక్తి దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, అప్పుడు షబ్బీర్ అలీ విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తోందని, రుణమాఫీ చేయడంతోపాటు ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. వరి వేస్తే ఉరి.. అని రైతులను గోస పెట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయకుండా చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీఆర్‌ఎస్‌కు హితవు పలికారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సూరత్ నుంచి చీరలు తీసుకోస్తే.. తమ ప్రభుత్వం కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల చేనేత కార్మికుల నుంచి చీరలు తీసుకొచ్చి పంపిణీ చేస్తోందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండా లని బీఆర్‌ఎస్‌కు సూచించారు. ప్రజలకు జవాబు చెప్పకోవడం మరిచిపోయారని కనీసం చెల్లెకు సమాధానం ఇవ్వాలని కేటీఆర్‌కు, మరదలికి జవా బు చెప్పుకోవాలని హరీశ్‌రావుకు మంత్రి హితవు పలికారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్‌చంద్ర, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
రైతులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం
గోస పెట్టింది..
మా ప్రభుత్వం న్యాయం చేస్తోంది
బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


