యథేచ్ఛగా జీరో దందా!
స్టీల్ వ్యాపారం..
బాన్సువాడ : జిల్లాలో జీరో దందా యథేచ్ఛగా సాగుతోంది. పన్ను చెల్లించకుండా అక్రమార్కులు కోట్లాది రూపాయల విలువైన సరుకులను జిల్లాలోకి తీసుకొస్తున్నారు. జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి జీరోలో సరుకులు సరఫరా అవుతున్నాయి. స్థానిక వ్యాపారులు సైతం పన్ను తప్పించుకునేందుకు జీరోలో సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే సరి.. లేదంటే ఇక తమకు అడ్డేముంది అన్న తరహా వ్యాపారం మారింది. ముఖ్యంగా నిర్మాణ రంగ సామగ్రి, నిత్యావసర సరుకులు జీరోలో భారీగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిత్యవసరాల సరుకులు సైతం..
మహారాష్ట్ర నుంచి బాన్సువాడ ప్రాంతానికి డీసీఎంలు, ట్రాలీ ఆటోల్లో రెండు, మూడు రోజులకోసారి నిత్యావసర సరుకులు దిగుమతి చేస్తున్నారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ – ముక్రంబాద్ ప్రాంతం నుంచి బెల్లం, నాందేడ్ నుంచి పిండి తదితర వస్తువులు బాన్సువాడకు వస్తున్నాయి. తక్కువ ధరకు దొరకడంతోపాటు పన్ను లేకపోవడంతో వ్యాపారులు మహారాష్ట్ర సరుకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడి వ్యాపారులు నేరుగా దుకాణాలకే సరుకులు వాహనాల్లో పంపిస్తుండడం ఇక్కడి వ్యాపారులకు కలిసివస్తోంది.
జీఎస్టీ తర్వాత
జీఎస్టీ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు పని లేకుండా పోయింది. జిల్లాలో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? నిబంధనలు ఏ మేరకు అమలవుతున్నాయి? ప్రభుత్వానికి సక్రమంగా ట్యాక్స్ చెల్లింపులు జరుగుతున్నాయా? అనే విషయాలపై సరిగా దృష్టి పెట్టడం లేదు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు జీరో దందాను జోరుగా సాగిస్తున్నారు.
నిర్మాణ రంగానికి సంబంధించి జిల్లాలో స్టీల్ వ్యాపారం జీరోలో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. వారానికి రెండు, మూడు సార్లు మహారాష్ట్ర నుంచి ఐరన్, సిమెంట్ లోడ్‌తో లారీలు బాన్సువాడకు వస్తున్నాయి. ముఖ్యంగా బాన్సువాడ పట్టణంలో పలువురు హార్డ్‌వేర్ వ్యాపారులు ఎలాంటి బిల్లులు లేకుండా మహారాష్ట్రలోని జాల్నా, నాందేడ్ తదితర ప్రాంతాల నుంచి స్టీల్, సిమెంట్ దిగుమతి చేసుకుంటున్నారు. గతంలో మహారాష్ట్ర నుంచి బాన్సువాడకు సిమెంట్ లోడ్‌తో వచ్చిన లారీని రెవెన్యూ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అయినా జీరో దందాకు అడ్డుకట్టపడడం లేదు.
మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి
హార్డ్‌వేర్, నిత్యావసర సరుకులు
వారానికి రెండుసార్లు
దిగుమతి చేస్తున్న వ్యాపారులు
పన్ను చెల్లించకుండా
తప్పించుకుంటున్న వైనం


