మీరు రైతులేనా..
మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆరుగురిపై కేసు
రామారెడ్డి : సన్నధాన్యానికి బోనస్ రావడం లేదని, పంట నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు, వారి వెంట ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించడంతో అసలు మీరు రైతులేనా.. అని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. భిక్కనూరు నుంచి రామారెడ్డి మీదుగా నిజామాబాద్ జిల్లా పాకాలకు వెళ్తున్న మంత్రి సీతక్క వాహనాన్ని రామారెడ్డి కొనుగోలు కేంద్రం ముందు రైతులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు రైతులతో కలిసి సమస్యలపై మంత్రిని ప్రశ్నించారు. రైతులు మంత్రితో మాట్లాడుతూ.. సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని మోసం చేస్తున్నారని, పంట నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీతక్క మీరు అసలు రైతులే కాదని పార్టీ ముసుగులో ప్రశ్నించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే సమయం, సందర్భం చూసి తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఉన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ తాము తాగివచ్చి ప్రశ్నించామని మంత్రి మాట్లాడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను రప్పించి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు.
బోనస్ రావడం లేదని,
పంట నష్టపరిహారం ఇవ్వలేదని
ప్రశ్నించిన రైతులు
వెంట ఉన్న బీఆర్‌ఎస్ నాయకులపై
ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
కామారెడ్డి క్రైం: నిజామాబాద్ జిల్లా సిరికొండకు వెళ్తున్న మంత్రి సీతక్క కాన్వాయ్‌ని రామారెడ్డిలోని అయోధ్యనగర్ వెంచర్ వద్ద అడ్డుకున్న ఘటనలో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, అకస్మాత్తుగా వాహనానికి అడ్డు వచ్చారని తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీపీ నారెడ్డి దశరఽథ్‌రెడ్డితోపాటు పడిగెల శ్రీనివాస్, కొత్తోళ్ల గంగారాం, బాలదేవ్ అంజయ్య, ద్యాగల మహిపాల్, హన్మయ్యల రాజయ్యపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


