పల్లె పోరుకు యంత్రాంగం సిద్ధం!
పల్లెల్లో మొదలైన చర్చ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వాయిదా పడుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌ల ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా అధికారులు పంచాయతీ ఎన్నిలకకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాలు రెడీగా ఉండడంతోపాటు అవసరమైన సిబ్బంది, అధికారుల వివరాలను సేకరించి సిద్ధం చేసుకున్నారు. అప్పట్లోనే బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసి ఉంచారు. కాగా జిల్లాలో 532 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులతోపాటు 4,656 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలో 6,39,730 మంది ఓటర్లు ఉండగా, 3,07,508 మంది పురుషులు, 3,32,209 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలో 4,670 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 5,605 మంది పోలింగ్ అధికారులు, 6,712 మంది పోలింగ్ సిబ్బంది అవసరమవుతారని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, ఉద్యోగులను పంచాయతీ ఎన్నికల డ్యూటీలకు జాబితాలు రూపొందించారు.
ఆశావాహుల సందడి
డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలియడంతో పల్లెల్లో ఆశావాహుల సందడి మొదలైంది. రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన చోటామోటా నాయకులు పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన వారు కూడా బరిలో నిలిచి సత్తా చాటాలని ఆరాటడపడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో పల్లెల్లో చర్చ మొదలైంది. అప్పట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో 27 శాతంతోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో అప్పుడు ఖరారైన రిజర్వేషన్లు తప్పనిసరిగా మారిపోవలసిందే. ఈ నేపథ్యంలో ఏ గ్రామ పంచాయతీ ఎవరికి రిజర్వ్ అవుతుందన్న దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారైనవి అలాగే ఉండే అవకాశం ఉంటుంది. 42 శాతం బీసీలకు కేటాయించిన వాటిలో మార్చే అవకాశాలుంటాయి.
జిల్లాలో 532 పంచాయతీలు, 4,656 వార్డులు
6,39,730 మంది ఓటర్లు,
4,670 పోలింగ్ స్టేషన్లు
12,317 మంది పోలింగు
సిబ్బంది అవసరం
మూడు విడతల్లో ఎన్నికల
నిర్వహణకు ప్లానింగ్


